ఫెడరర్ పై పోట్రో గెలుపు న్యూయార్క్ : 20 సంవత్సరాల అర్జెంటీనా క్రీడాకారుడు జువాన్ మార్టిన్ డెల్ పోట్రో సోమవారం రాత్రి న్యూయార్క్ ఫ్లషింగ్ మెడోస్ లో ఐదు సార్లు యుఎస్ ఓపెన్ చాంపియన్ రోజర్ ఫెదరర్ పై సంచలనాత్మక విజయం సాధించాడు. ప్రపంచ నంబర్ వన్, టాప్ సీడ్ ఫెదరర్ పై రెండు సార్లు వెనుకబడినా ప్రపంచ నంబర్ 6 డెల్ పోట్రో పుంజుకుని 3-6, 7-6, 4-6, 7-6, 6-2తో గెలిచి తన తొలి కెరీర్ గ్రాండ్ శ్లామ్ టైటిల్ ను హస్తగతం చేసుకున్నాడు. రెండవ, నాలుగవ సెట్లను టై బ్రేక్ లతో గెలుచుకుని సెట్ల స్కోరును 2-2తో సమం చేసిన డెల్ పోట్రో ఐదవ సెట్ లో చివరి గేమ్ లో ఫెదరర్ సర్వ్ ను బ్రేక్ చేసి టైటిల్ సాధించాడు. ఈ మ్యాచ్ మొత్తం నాలుగు గంటల ఆరు నిమిషాల సేపు సాగింది.
ఆరవ సీడ్, 6.6 అడుగుల డెల్ పోట్రో ఫైనల్ అనంతరం ట్రోఫీ ప్రదాన కార్యక్రమంలో మాట్లాడుతూ, 'ఈ వారం నాకు రెండు కలలు ఉన్నాయి' అని చెప్పాడు. 'ఒకటి యుఎస్ ఓపెన్ గెలవడం. రెండవది రోజర్ వలె విజయాలు సాధించడం. ఒకటి నెరవేరింది. కాని రెండవది సాఫల్యం కావాలంటే నేను నా ఆటను మరింతగా మెరుగుపరచుకోవలసిన అవసరం ఉంది' అని రికార్డు స్థాయిలో 15 గ్రాండ్ శ్లామ్ టైటిల్స్ విజేత ఫెదరర్ వైపు చూస్తూ అతను చెప్పాడు.
కాగా, డెల్ పోట్రో యుఎస్ ఓపెన్ లో పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న రెండవ అర్జెంటీనా క్రీడాకారుడు అయ్యాడు. 1977లో యుఎస్ ఓపెన్ టైటిల్ సాధించిన గ్విలెర్మో విలాస్ ఆర్థర్ ఆషె స్టేడియంలో ఈ ఫైనల్ ను తిలకించాడు. ఇంతకుముందు ఫెదరర్ తో జరిగిన ఆరు పోటీలలోనూ డెల్ పోట్రో గెలవలేకపోయాడు. ఈ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ లో ఫెదరర్ తో సెమీ ఫైనల్ లో 2-1 సెట్ల ఆధిక్యంలో ఉండి కూడా డెల్ పోట్రో చివరకు ఓటమి చవి చూశాడు.
News Posted: 15 September, 2009
|