సోమ్ దేవ్ సంచలనం జోహనెస్‌బర్గ్: పదకొండేళ్ల తర్వాత తొలిసారిగా భారత్ డేవిస్‌కప్ ప్రపంచ గ్రూప్‌నకు అర్హత సాధించింది. చివరి సారిగా భారత్ 1998 ప్రపంచగ్రూప్‌లో ఆడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన డేవిస్‌కప్ ప్లే ఆఫ్ పోరులో భారత్ 4-1 తేడాతో తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకొంది. కీలకమైన రివర్స్ సింగిల్స్ తొలిపోరులో భారత యువ టెన్నిస్ స్టార్ ప్రపంచర్యాంకింగ్‌లో 133వ స్థానంలో ఉన్న సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ నాలుగు గంటల 44 నిమిషాల పాటు పోరాడి 3-6, 6-7(3-7), 7-6(7-5), 6-2, 6-4 తేడాతో దక్షిణాఫ్రికా నెంబర్ వన్ ఆటగాడు రిక్ డి వోస్ట్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాడు.
దాంతో రెండో రివర్స్ సింగిల్స్ బోపన్నకు బదులుగా యూకీ బాంబ్రీ బరిలో దిగాడు. అయితే యూకీ 3-6, 6-3, 6-4 తేడాతో ఇజాక్ వాన్ డేర్ మోర్వ్‌పై గెలుపొందాడు. ఇక్కడ ఎలిక్ పార్క్ ఇండోర్ స్టేడియంలో జరిగిన తొలి రివర్స్ సింగిల్స్‌లో ఆరంభంలో సోమ్‌దేవ్ తొలి రెండు సెట్లను కోల్పోయి కూడా... ఆ తర్వాత పుంజుకొని వరుసగా మూడుసెట్లలో గెలిచి భారత్‌ను అద్భుత విజయాన్ని అందించాడు. తొలిసెట్‌లో 3-3తో సమంగా ఉన్న తరుణంలో సోమ్‌దేవ్ సర్వీస్‌ను చేజార్చుకోవడంతో డివోస్ట్ ఆధిక్యాన్ని చివరి వరకు నిలబెట్టుకొని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండోసెట్ హోరాహోరిగా జరగడంతో టై బ్రేక్‌కు దారి తీసింది. డివోస్ట్ టైబ్రేక్‌ను 7-3తో సొంతం చేసుకున్నాడు.
మూడోసెట్‌లో తొలిగేమ్‌ను కోల్పోయిన సోమ్‌దేవ్ ఆ తర్వాత పుంజుకొని ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత ఈ సెట్ కూడా టైబ్రేక్‌కు దారి తీయడంతో అందులో సోమ్‌దేవ్ 7-5తో గెలిచి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఒక నాలుగో సెట్‌లో విజృంభించిన భారత స్టార్ 5-1దూసుకుపోయి సెట్‌ను గెలిచి 2-2తో సమం చేశాడు. ఇక కీలకమైన ఐదోసెట్‌లో 2-2తో ఉన్నప్పుడు ఐదోగేమ్‌లో డివోగ్స్ సర్వీస్‌ను బ్రేక్ చేసి చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకొన్న సోమ్‌దేవ్ సంచలన విజయాన్ని సాధించాడు.
News Posted: 20 September, 2009
|