శ్రీలంక 'డక్ వర్త్' గెలుపు సెంచూరియన్ : దక్షిణాఫ్రికా జట్టును వెన్నును దాని సొంతగడ్డపైనే శ్రీలంక జట్టు విరిచేసింది. దీనితో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుకు ఆదిలోనే హంసపాదు ఎదురైనట్లైంది. డక్ వర్త్ లూయీస్ రూపంలో దక్షిణాఫ్రికాను అపజయం ముంచేసింది. భారీ వర్షం కారణంగా ఆటకు ఆటంకం ఏర్పడడంతో అంపైర్లు డక్ వర్త్ లూయీస్ విధానంలో విజేతను నిర్ణయించారు. దీనితో శ్రీలంక 55 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఈ టోర్నీలో తొలి విజయం నమోదు చేసుకుంది. 92 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, 16 బౌండరీల సాయంతో 106 పరుగులు చేసి శ్రీలంక విజయానికి బాటలు వేసిన ఆ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్ మన్ తిలకరత్నె దిల్షాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
మంగళవారం ఇక్కడి సూపర్ స్పోర్ట్ పార్క్ మైదానంలో ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ 2009 గ్రూప్ బి విభాగంలో జరిగిన తొలి పోటీలో దక్షిణాఫ్రికా సొంతగడ్డపైనే పరాజయాన్ని మూటకట్టుకుంది. సౌతాఫ్రికా జట్టు కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గ్రేమ్ స్మిత్ ఒక్కడు మాత్రమే 58 పరుగులతో అర్ధ సెంచరీ చేయగా మరెవ్వరూ రాణించకపోవడం, దక్షిణాప్రికా జట్టులోని మూడు కీలక వికెట్ల (గ్రేమ్ స్మిత్ 106, జాక్విస్ కల్లిస్ 41, జెపి దమిని 0)ను మట్టి కరిపించిన శ్రీలంక బౌలర్ అజంతా మెండిస్ రూపంలో పరాజయం వెంటాడింది.
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. దీనితో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 319 పరుగులు సాధించి, దక్షిణాఫ్రికాకు 320 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక బ్యాట్స్ మెన్ దిల్షాన్ 106, సనత్ జయసూర్య 10, కుమార సంగక్కర 54, మహేల జయవర్దనె 77, తిలన్ సమరవీర 37, ఏంజెలో మాథ్యూస్ 15, తిలిన కందంబె 6, నువన్ కులశేఖర 1 పరుగు చేయగా ముత్తయ్య మురళీధరన్ పరుగులేవీ చేయకుండా నాటౌట్ బ్యాట్స్ మన్ గా నిలిచాడు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో డేల్ స్టేన్, వేన్ పార్నెల్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. జె.పి. దమిని ఒక వికెట్ తీసుకున్నాడు. ఒక రన్నౌట్ వికెట్ లభించింది.
సమాధానంగా కెప్టెన్ గ్రేమ్ స్మిత్, హషిమ్ ఆమ్లలతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 37.4 ఓవర్లు పూర్తయ్యే సరికి 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. మైదానంలో భారీగా వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. దీనితో అంపైర్లు డక్ వర్త్ లూయీస్ విధానంలో శ్రీలంక జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించారు. దక్షిణాప్రికా బ్యాట్స్ మెన్ లో గ్రేమ్ స్మిత్ 58, హషిం ఆమ్ల 2, జాక్విస్ కల్లిస్ 41, ఎబి డీ విల్లియర్స్ 24, జెపి దమిని 0, మార్క్ బుచర్ 26, జాన్ బోథ 21 పరుగులు చేశారు. అల్బీ మార్కెల్ 29, రోలఫ్ వాన్ డెర మెర్వ్ 3 పరుగులతోనూ నాటౌట్ బ్యాట్స్ మెన్ గా ఉన్నారు.
శ్రీలంక బౌలర్లలో అజంతా మెండిస్ 3, లసిత్ మలింగ, ఏంజెలో మాథ్యూస్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
News Posted: 23 September, 2009
|