ఇండియాకు తిరిగి టాప్ ర్యాంక్ సెంచూరియన్ : ఇండియా తిరిగి ఐసిసి ఒడిఐ ర్యాంకింగ్ లలో అగ్ర స్థానాన్ని ఆక్రమించింది. మంగళవారం ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ తొలి మ్యాచ్ లో శ్రీలంక జట్టు డక్ వర్త్ లూయిస్ పద్ధతిపై ఆతిథేయ జట్టు దక్షిణాఫ్రికాను 55 పరుగుల తేడాతో ఓడించిన అనంతరం ఇండియా తిరికి టాప్ జట్టు అయింది.
శ్రీలంక జట్టు 8 వికెట్ల నష్టానికి 319 పరుగులతో దక్షిణాఫ్రికాపై తన అత్యధిక వన్ డే స్కోరును సాధించింది. ఓపెనర్ తిలకరత్నె దిల్షన్ 92 బంతులలో 106 పరుగులు చేసి లంక జట్టుకు ఈ స్కోరును సాధ్యం చేశాడు. ఆతరువాత లంక స్పిన్నర్ అజంతా మెండిస్ 30 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగే సమయానికి దక్షిణాఫ్రికా జట్టు 37.4 ఓవర్లలో 206 పరుగులు చేసింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితాన్ని తేల్చారు.
ఈ ఫలితం దృష్ట్యా ప్రస్తు నంబర్ వన్ జట్టు అయిన దక్షిణాఫ్రికా మూడవ స్థానానికి పతనం కాగా ఇండియా ప్రథమ స్థానానికి పురోగమించింది. ఆస్ట్రేలియా రెండవ స్థానంలో నిలచింది. కొన్ని రోజులు క్రితం మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకలో కాంపాక్ కప్ ముక్కోణపు సీరీస్ లో న్యూజిలాండ్ జట్టుపై ఆరు వికెట్లతో గెలిచిన అనంతరం వన్ డే ర్యాంకింగ్ లలో అగ్ర స్థానాన్ని ఆక్రమించిన విషయం విదితమే. అయితే, భారత జట్టు 24 గంటలు కూడా గడవక ముందే లంక జట్టు చేతిలో ఓటమితో తిరిగి మూడవ స్థానానికి దిగిపోయింది.
News Posted: 23 September, 2009
|