మన వస్తాదు రికార్డు హెర్నింగ్ (డెన్మార్క్) : డెన్మార్క్ లోని హెర్నింగ్ లో జరుగుతున్న ప్రపంచ కుస్తీ చాంపియన్ షిప్స్ లో ఫ్రీస్టైల్ 74 కిలోల విభాగంలో భారత వస్తాదు రమేష్ కుమార్ కాంస్య పతకం గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించాడు. బీజింగ్ ఒలింపిక్ కాంస్య పతక విజేత సుశీల్ కుమార్ సాధించలేని ఘనతను ఉత్తర ప్రదేశ్ వస్తాదు రమేష్ సాధించాడు., 32 సంవత్సరాల విరామం తరువాత ప్రతిష్ఠాకరమైన ఒక టోర్నీలో ఇండియాకు తొలి పతకాన్ని రమేష్ సంపాదించాడు.
బుధవారం రాత్రి జరిగిన పోటీలో రమేష్ కుమార్ తన మొల్దోవా ప్రత్యర్థి అలెగ్జాండర్ బుర్కాను టెక్నికల్ పాయింట్లపై ఓడించాడు. రెపెచేజ్ రౌండ్ లో ఇద్దరూ 7-7 స్కోరుతో సమ ఉజ్జీగా నిలవడంతో టెక్నికల్ పాయింట్ల ప్రాతిపదికగా విజేతను నిర్ణయించారు. అయితే, రమేష్ కుమార్ ఈ పోటీని నిరాశాజనకంగా ప్రారంభించాడు. ఫస్ట్ పీరియడ్ అనంతరం అతను 0-3తో వెనుకబడ్డాడు. కాని రెండవ సెషన్ లో అతను పుంజుకుని రెండు పాయింట్లు స్కోరు చేశాడు. ఫైనల్ పీరియడ్ లో అతను మరింతగా విజృంభించి ఐదు పాయింట్లు స్కోరు చేశాడు. అతని ప్రత్యర్థి ఈ వ్యవధిలో నాలుగు పాయింట్లు మాత్రమే పొందాడు. దీనితో ఇద్దరి స్కోర్లూ సమం కావడంతో టెక్నికల్ పాయింట్లపై రమేష్ ను విజేతగా ప్రకటించారు.
రమేష్ కుమార్ తొలి రౌండ్ లో అమెరికన్ వస్తాదు డస్టిన్ ష్లాటర్ ను 3-2 స్కోరుతోను, రెండవ రౌండ్ లో గ్రేట్ బ్రిటన్ వస్తాదు మైకేల్ గ్రుండీని 4-2తోను ఓడించాడు. రమేష్ క్వార్టర్ ఫైనల్ లో బల్గేరియా వస్తాదు కిరిల్ తెర్జీవ్ పై 7-4తో గెలుపొందాడు. అయితే, సెమీఫైనల్ దశలో రమేష్ అజర్ బైజాన్ కు చెందిన చామ్సుల్వారా చామ్సుల్వారయెవ్ చేతిలో 0-5తో ఓడిపోవడంతో స్వర్ణ పతకావకాశాన్ని కోల్పోయాడు. ఈ కేటగరీలో రష్యన్ డెనిస్ సర్గుష్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు.
ఇది ఇలా ఉండగా, మహిళల విభాగంలో 48 కిలోల తరగతిలో భారతీయురాలు నిర్మలా దేవి తొలి రౌండ్ లో గ్రేట్ బ్రిటన్ కు చెందిన యానా స్టడ్నిక్ చేతిలోను, బబితా కుమారి 51 కిలోల తరగతిలో క్వార్టర్ ఫైనల్ లో మొల్దోవాకు చెందిన నటాలియా బుడు చేతిలోను ఓడిపోయారు.
News Posted: 24 September, 2009
|