న్యూజిలాండ్ 214 ఆలౌట్ సెంచూరియన్ : దక్షిణాఫ్రికాతో ఇక్కడి సూపర్ స్పోర్ట్ పార్క్ లో జరుగుతున్న ఐసిసి చాంపియన్ షిప్ గ్రూప్ బి మూడో వన్డేలో న్యూజిలాండ్ 214 పరుగులకు ఆలౌట్ అయింది. నిర్ణీత 50 ఓవర్లలోనూ ఇంకా 2.1 ఓవర్లు మిగిలి ఉండగానే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసిపోయేలా దక్షిణాఫ్రికా జట్టు కట్టడి చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్ వేన్ పార్నెల్ బౌలింగ్ ధాటికి న్యూజిలాండ్ జట్టు ఐదు వికెట్లను బంగారుపళ్ళెంలో పెట్టి అప్పగించుకోవాల్సి వచ్చింది.
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు న్యూజిలాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బి.మెకల్లమ్ - జెస్సీ రైడర్ లతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టులో త్రీ డౌన్ లో బరిలో దిగిన రాస్ టేలర్ (75 పరుగులు) మినహా మరెవ్వరూ హాఫ్ సెంచరీ కూడా చేయలేక చతికిలపడ్డారు. గుడ్డిలో మెల్ల అన్నట్లు మెకల్లమ్ 44, గ్రాంట్ ఇల్లియట్ 39 కాస్త గౌరవప్రదమైన స్కోర్లు చేయగా మార్టిన్ గుప్టిల్ 21పరుగులతో పరవాలేదనిపించాడు. మిగిలిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ లో గ్రీత్ హాప్కిన్స్ 13, జెస్సీ రైడర్ 8, నీల్ బ్రూమ్ 1, కేల్ మిల్స్ 0, డారిల్ టఫీ 4, షేన్ బాండ్ 0 పరుగులు చేయగా డేనియల్ వెట్టోరి 1 పరుగుతో నాటౌట్ గా నిలిచాడు.
దక్షిణాఫ్రికా బౌలింగ్ లో వేన్ పార్నిల్ 5 న్యూజిలాండ్ వికెట్లను తుత్తినియలు చేశాడు. కేవలం 8 ఓవర్లు బౌల్ చేసిన పార్నిల్ 57 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసుకోవడం విశేషం. డేల్ స్టెయిన్, రెలోఫ్ వాన్ డెర్ మెర్వ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. జాన్ బోథ ఒక వికెట్ తీసుకున్నాడు.
దక్షిణాప్రికా 215 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. కెప్టెన్ గ్రేమ్ స్మిత్ - హషిమ్ ఆమ్ల ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా క్రీజ్ వద్ద ఆడుతున్నారు.
News Posted: 24 September, 2009
|