సెంచూరియన్ : పరాజయాల పరంపరలో కూరుకుపోతున్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు ఇంకా మంచి రోజులు రాలేదు. గురువారం సౌతాఫ్రికాతో జరిగన లీగ్ మ్యాచ్ లో మరో ఓటమిని మూట గట్టుకుంది. ఇప్పటికే చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో ఓడిపోయి ఉన్న సౌతాఫ్రికా గెలిచి తీరాల్సిన ఈ పోటీలో సమష్టిగా రాణించి విజయాన్ని కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 47.5 ఓవర్లలో 214 పరుగుకే పెవిలియన్ కు చేరింది. ఈ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 41.1 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి సాధించింది. డివిలియర్స్ (70 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు.
తక్కువ పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన అతిథ్య జట్టు ప్రారంభంలోనే స్మిత్(7) వికెట్‌ను కోల్పోయింది. లంకపై అర్ధ సెంచరీ సాధించిన స్మిత్ ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. టఫీ అద్భుత బంతితో స్మిత్‌ను ఔట్ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 22 పరుగులు మాత్రమే. మరోవైపు ఆమ్లాతో జతకలిసిన వెటరన్ ఆల్‌రౌండర్ కలిస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఆమ్లాతో కలిసి రెండో వికెట్‌కు 52 పరుగులు జోడించాడు. కుదురుగా ఆడుతున్న కలిస్‌ను షేన్‌బాండ్ పెవిలియన్ పంపాడు.
ఈ సమయంలో క్రీజులో వచ్చిన స్టార్ ఆటగాడు డివిలియర్స్ కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఆమ్లా అతనికి మంచి సహకారం అందించాడు. ఈ క్రమంలో 65 బంతుల్లో 3ఫోర్లతో 38 పరుగులు చేసిన ఆమ్లాను వెటోరీ ఔట్ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 3వికెట్లకు 108. తర్వాత వచ్చిన డుమినీ(11) పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు.
అయితే డివిలియర్స్ మాత్రం జోరు కొనసాగించాడు. వికెట్ కీపర్ బౌచర్ సహకారంతో ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఇద్దరు పోటీపడి ఫోర్లు కొట్లారు. దీంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. ధాటిగా ఆడిన బౌచర్ 28 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసిన టఫీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అప్పటికి దక్షిణాఫ్రికా స్కోరు 5వికెట్లకు 180 పరుగులు. మోర్కెల్‌తో కలిసి డివిలియర్స్ మరో వికెట్ కోల్పోకుండానే దక్షిణాఫ్రికాను విజయతీర్థానికి చేర్చాడు. బౌలింగ్‌లో రాణించిన పార్నెల్‌కు మ్యాన్ ఆఫ్‌ద మ్యాచ్ అవార్డు దక్కింది.