ఇంగ్లండ్ 6 వికెట్ల విజయం జోహెన్నెస్ బర్గ్ : ఇక్కడి న్యూ వాండరర్స్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ బి 4వ వన్డే (డే &నైట్)లో శ్రీలంక జట్టుపై ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. విజయానికి అవసరమైన 213 పరుగులను ఇంగ్లండ్ 45 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి చేయగలిగింది. ఎనిమిది ఓవర్లు బౌల్ చేసి కేవలం 24 పరుగులు మాత్రమే ఇవ్వడమే కాకుండా 51 బంతుల్లో 3 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 46 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ పాల్ కాలింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ను ఎంచుకుంది. ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు తిలకరత్నె దిల్షాన్ - సనత్ జయసూర్యలతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక జట్టు టాప్ ఆర్డర్ మొత్తం ఇంగ్లండ్ ధాటికి తలఒగ్గి క్రీజ్ నుంచి తప్పుకుంది. మొదటగా బ్యాటింగ్ కు వచ్చిన నలుగురు శ్రీలంక బ్యాట్స్ మెన్ కేవలం 12 పరుగులు చేయడంతో లంక కష్టాలు మొదలయ్యాయి. అనంతరం బరిలో దిగిన థిలన్ సమరవీర ఇంగ్లండ్ బౌలింగ్ పై కొద్దిగా పోరాటం చేసినప్పటికీ 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరక తప్పలేదు. ఆపైన బ్యాటింగ్ కు వచ్చిన మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ థిలిన కందంబె 53, ఏంజెలో మాథ్యూస్ 52 ఇంగ్లండ్ జట్టుపై పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కందంబె, మాథ్యూస్ ఔటయిన అనంతరం ఇక మరెవ్వరూ క్రీజ్ వద్ద ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. దీనితో 47.3 ఓవర్లకే శ్రీలంక జట్టు 212 పరుగులు చేసి కుప్పకూలిపోయింది. ముత్తయ్య మురళీధరన్ 18, లసిత్ మలింగ 0, అజంతా మెండిస్ 5 పరుగులకే వెనక్కి తిరిగి వచ్చేశారు. కాగా నువన్ కులశేఖర మాత్రం 24 బంతులు ఎదుర్కొని 17 పరుగులు చేసి నాటౌట్ బ్యాట్స్ మన్ గా నిలిచాడు.
సమాధానంగా 213 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు తొలి రెండు వికెట్లనుకెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ 9, జోయ్ డెన్లీ 5 పరుగులకే కోల్పోయింది. ఒన్ డౌన్ లో క్రీజ్ వద్దకు వచ్చిన ఒవైస్ షా 44, పాల్ కాలింగ్ వుడ్ 46 పరుగులు చేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. వీరిద్దరి వికెట్లు కోల్పోయిన తరువాత బరిలోకి వచ్చిన ఇ. మోర్గాన్ 62, మాట్ ప్రయర్ 28 పరుగులతో నాటౌట్ బ్యాట్స్ మెన్ గా ఉండి ఇంగ్లండ్ కు విజయాన్ని చేకూర్చిపెట్టారు. దీనితో ఇంగ్లండ్ 6 వికెట్ల భారీ తేడాతో మ్యాచ్ విజేతగా నిలిచింది.
ఇంగ్లండ్ బౌలింగ్ లో జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ చెరో మూడేసి వికెట్లు పడగొట్టారు. గ్రాహం ఓనియన్ 2, ల్యూక్ రైట్ 1 వికెట్ తీసుకున్నారు. శ్రీలంక బౌలర్లలో నువన్ కులశేఖర 2 వికెట్లు తీసుకోగా లసిత్ మలింగ, ముత్తయ్య మురళీధరన్ చెరో వికెట్ తీసుకున్నారు. శ్రీలంక మొత్తం బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ విఫలమై ప్రత్యర్థికి విజయాన్ని పళ్ళెంలో పెట్టి అందించింది.
News Posted: 25 September, 2009
|