టాస్ నెగ్గిన పాక్ సెంచూరియన్ : చాంపియన్స్ ట్రోఫీ పోటీల్లో భాగంగా దాయాదులు భారత్- పాక్ జట్ల మధ్య గ్రూప్ ఎ విభాగంలో జరుగుతున్న 6వ వన్డే మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తున్నది. శనివారంనాడు ఇక్కడి సూపర్ స్పోర్ట్ పార్క్ లో ఈ మ్యాచ్ డే అండ్ నైట్ మ్యాచ్ గా జరుగుతున్నది. ఈ మ్యాచ్ ను ఇరు జట్లూ ప్రతిష్టాత్మకంగా భావించి సర్వ శక్తులనూ ఒడ్డి పోరాటానికి దిగాయి. పాకిస్తాన్ - భారత జట్ల మధ్య మ్యాచ్ అంటేనే సర్వత్రా ఉత్కంఠకు తెరలేవడం సహజంగా మారింది. దీనితో ఇరు దేశాల్లోని క్రీడాభిమానులు టీవీ సెట్లకు అతుక్కుపోయి తిలకిస్తున్నారు. ఇరు జట్లూ గెలుపు కోసం వీరోచిత పోరాటం చేస్తున్నందున క్రీడాభిమానులకు రసవత్తరమైన క్రికెట్ విందు లభించే అవకాశాలున్నాయి.
భారతజట్టులో గాయపడిన యువరాజ్ సింగ్ స్థానంలో విరాట్ కోహ్లి జట్టులో స్థానం సంపాదించాడు. జట్టులో మరికొన్ని మార్పులు, చేర్పులు కూడా జరిగాయి. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్ తో భారత్ బరిలోకి దిగింది. ఆట 6.3వ ఓవర్ ముగిసే సరికి పాకిస్తాన్ తొలి వికెట్ కోల్పోయి 45 పరుగులతో ఆడుతోంది. ఆట 4.2వ ఓవర్ లో ఆశిష్ నెహ్రా వేసిన బంతిని ఆడిన పాక్ ఓపెనర్ హర్భజన్ సింగ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కమ్మాన్ అఖ్మల్ - యూనిస్ ఖాన్ లు క్రీజ్ వద్ద ఉన్నారు.
News Posted: 26 September, 2009
|