చాంపియన్లదే చాంపియన్స్ ట్రోఫీ సెంచూరియన్ : ఐసిసి చాంపియన్స్ ట్రోఫీని డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది. అద్భుత సెంచరీతో అదరగొట్టిన షేన్ వాట్సన్, అర్ధ సెంచరీతో నిలకడగా ఆడిన వైట్, ఆస్ట్రేలియా బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్ పై ఆరు వికెట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సంచలనాలతో ఫైనల్ కూ దూసుకువచ్చిన న్యూజిలాండ్ ను కంగు తినిపించి, ట్రోఫీని ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయింది. ఇక్కడి సూపర్ స్పోర్ట్స్ పార్క్ లో సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ ను పాంటింగ్ సేన గెలుచుకుంది. 105 పరుగుల అజేయ సెంచరీ చేసిన ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్ మన్ షేన్ వాట్సన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇంకా 28 బంతులు మిగిలి ఉండగానే పాంటింగ్ సేన నాలుగు వికెట్లు నష్టపోయి విజయానికి అవసరమైన లక్ష్యం 201 పరుగులకు గాను 206 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 200 పరుగులు చేసింది. జట్టు కెప్టెన్ వెటోరీ గాయ కారణంగా ఫైనల్ మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ బాధ్యతను తాత్కాలికంగా చేపట్టిన మెక్ కల్లమ్ తన ఆటతీరుకు పూర్తి భిన్నంగా ఆడి దారుణంగా విఫలమయ్యాడు. 14 బంతులు ఎదుర్కొన్న మెక్ కల్లమ్ డకౌట్ అవడంతో న్యూజిలాండ్ కష్టాలు మొదలయ్యాయి. మిగతా బ్యాట్స్ మెన్ ఏ ఒక్కరూ కనీసం అర్ధ సెంచరీ చేసిన పాపాన పోలేదు. మార్టిన్ గుప్టిల్ 40, నీల్ బ్రూమ్ 37, జేమ్స్ ఫ్రాంక్లిన్ 33, ఆరోన్ రెడ్మండ్ 26 గౌరవం దక్కించే పరుగులు చేయగలిగారు. మిగతా బ్యాట్స్ మెన్ లో రాస్ టేలర్ 6, గ్రాంట్ ఇలియట్ 9, కెయిల్ మిల్స్ 12, ఇయాన్ బట్లర్ 6 పరుగులు చేయగా జీటన్ పటేల్ 16, షేన్ బాండ్ 3 పరుగులతో నాటౌట్ బ్యాట్స్ మెన్ గా ఉన్నారు.
విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా జట్టు బ్యాట్స్ మెన్ లో ఓపెనింగ్ బ్యాట్స్ మన్ షేన్ వాట్సన్ 105 నాటౌట్, టిమ్ పెయినె 1, కెప్టెన్ రికీ పాంటింగ్ 1, కామెరూన్ వైట్ 62, మైఖేల్ హస్సే 11, జేమ్స్ హోప్స్ 22 నాటౌట్ పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలింగ్ లో నాథన్ హారిట్జ్ 3 వికెట్లు పడగొట్టాడు. బ్రెట్ లీ 2 వికెట్లు తీయగా పీటర్ సిడ్డిల్, మిట్చెల్ జాన్సన్ చెరో వికెట్ తీసుకున్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ మిల్స్ ఒక్కడే 3 వికెట్లను పడగొట్టగా, మిగతా వికెట్ ను షేన్ బాండ్ తీసుకున్నాడు.
న్యూజిలాండ్ జట్టు గాయాల కారణంగా అన్ని విభాగాల్లోనూ దారుణంగా విఫలం కావడంతో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా వరుసగా రెండోసారీ ఐసిసి చాంపియన్స్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది.
News Posted: 6 October, 2009
|