పిటి ఉష కన్నీరు మున్నీరు! భోపాల్: దేశంలో క్రికెటేతర క్రీడాకారులపై వివక్షకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. భారత లెజెండరీ పరుగులు రాణి పిటి ఉషకు భోపాల్ లో దారుణమైన అవమానం జరిగింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరగుతున్న 49 జాతీయ అథ్లెటిక్స్ మీట్‌కు అతిధిగా హాజరుకావాల్సిందిగా భారత క్రీడాప్రాధికార సంస్థ (శాయ్) నుంచి ఆహ్వానం అందింది. అయితే భోపాల్ అథ్లెటిక్స్ మీట్ ప్రారంభోత్సవానికి హాజరైన ఉషకు కనీస స్థాయిలో వసతి ఏర్పాట్లు జరగలేదు. శాయ్ హోటల్‌లో ఉషకు వసతి ఏర్పాట్లు చేశారు. అది కూడా ఉషతో పాటు మరో ఐదుగురి అథ్లెట్లతో కలిపి ఒకే గదిని కేటాయించారు. దీనిపై ఆగ్రహం చెందిన ఉష జాతీయ మీడియా ముందు కన్నీరు మున్నీరు అయింది. ఉన్నత స్థాయిలో లేకున్నా... మరీ ప్రాథమిక స్థాయిలోను తనకు వసతి ఏర్పాటు చేయడపోవడంతో నిర్వాహకులపై విరుచుకపడింది. ‘ నిర్వాహకులు ఈ విధంగా ప్రవర్తిస్తారని నేను అసలు ఊహించలేదు. ఇలాంటి సంఘటనలు జరిగితే తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రీడలపై ప్రోత్సాహాన్ని ఎలా పెంచుతారు? వారు దేశానికి పతకాలు ఎలా తేగలరు? దీన్ని నేను అవమానంగా భావిస్తున్నాన’ని ఉష మీడియా వద్ద వాపోయింది.
ఉష అవమాన ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించదని మధ్యప్రదేశ్ రాష్ట్ర క్రీడామంత్రి తుకోజి రావ్ పవర్ తెలిపారు. అతిధులకు వసతుల ఏర్పాటు, తదితర అంశాలను శాయ్ చూసుకోవాలని, ప్రభుత్వం కార్యక్రమ మాలను మాత్రమే పరిశీలిస్తుంది. అయితే ఇలాంటి ఘటనలు అనుకోకుండా జరిగాయని, దానికి విచారిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉషకు భోపాల్‌లోని జహన్నుమ హోటల్‌లో వసతి ఏర్పాటు చేశారు. ఉదయం ఆమెతో మాట్లాడనని, ఇప్పుడు తనకు సౌకర్యంగా ఉందని చెప్పినట్లు మంత్రి వెల్లడించాడు. ఈ ఘటనపై ప్రభుత్వం ఎలాంటి విచారణకు ఆదేశించడం లేదని, ఇది శాయ్ అంతర్గత వ్యవహారమని ఆయన అన్నారు. ఉషను తాము అవమానించాలని అలా చేయలేదని, సమాచార లోపం వల్ల అనుకోకుండా ఈ దురదృష్ట సంఘటన చోటు చేసుకొందని భారత అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఏఎఫ్‌ఐ)విచారం వ్యక్తం చేసింది. జరిగిన తప్పిదానికి ఉషను బహిరంగంగా క్షమాపణలు కోరుతున్నామని, ఇప్పుడు ఆమెకి తగిన సౌకర్యాలను ఏర్పాటు చేశామని ఏఎఫ్‌ఐ తెలిపింది.
News Posted: 6 October, 2009
|