'పాక్ కావాలనే ఓడింది' ఇస్లామాబాద్ : దక్షిణాఫ్రికాలో ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ లో ఆస్ట్రేలియాతో పోటీలో చివరి బంతి వరకు ఆడి ఓడిపోవడంపై సంజాయిషీని కోరేందుకు పాకిస్తాన్ జట్టు కెప్టెన్ యూనిస్ ఖాన్ ను, కోచ్ ఇంతిఖాబ్ ఆలమ్ ను, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధ్యక్షుడు ఇజాజ్ బట్ ను తమను కలుసుకోవలసిందిగా పాకిస్తానీ పార్లమెంటరీ కమిటీ ఒకటి ఆదేశించింది. పాకిస్తానీ దిగువ సభలో క్రీడా విషయాల స్థాయీ సంఘం చైర్మన్ జంషెడ్ దస్తి 'ఎపి' వార్తా సంస్థ విలేఖరితో మాట్లాడుతూ, ఫైనల్ లో ఇండియాకు స్థానం దక్కకుండా చేయడానికే పాక్ జట్టు ఆస్ట్రేలియాపై ఓడిపోయిందని ఆరోపించారు. అప్పటికే సెమీఫైనల్స్ దశకు చేరుకున్న పాకిస్తాన్ కనుక సెంచురియన్ లో సెప్టెంబర్ 30 నాటి పోటీని గెలుచుకున్నట్లయితే అదే రోజు మరొక పోటీలో వెస్టిండీస్ జట్టును చిత్తు చేసిన ఇండియా సెమీ ఫైనల్స్ కు చేరుకుని ఉండేది.
'ఇండియాను టోర్నమెంట్ నుంచి బయటకు నెట్టడం కోసమే వారు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు' అని దస్తి ఆరోపించారు. 'వారు (జట్టు) తమ సత్తా మేరకు ఆడలేదు. జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ (సెమీఫైనల్ లో) చేతుల్లో పోటీలను ఉద్దేశపూర్వకంగా ఓడిపోయిందని మేము భావిస్తున్నందున అక్టోబర్ 13న వారిని కలుసుకోబోతున్నాం' అని దస్తి తెలియజేశారు. 'గౌరవనీయ వ్యక్తులు కొందరు, సీనియర్లు కొందరు మాతో మాట్లాడారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో పోటీలలో ఏదో గూడుపుఠాణి జరిగి ఉండవచ్చు కనుక తత్సంబంధిత సాక్ష్యాధారాలను సేకరించేందుకు కూడా మేము ప్రయత్నిస్తున్నాం' అని దస్తి చెప్పినట్లు 'పిటిఐ' వార్తా సంస్థ తెలియజేసింది. 'మేము ఈ వ్యవహారంపై కూలంకషంగా దర్యాప్తు జరిపి వాస్తవాన్ని తెలుసుకుంటాం. దక్షిణాఫ్రికాలో జరిగిందేమిటో జాతికి తెలియాలి' అని దస్తి పేర్కొన్నారు.
News Posted: 7 October, 2009
|