ఐపిఎల్ జట్లతో షాక్! న్యూఢిల్లీ : చాంపియన్స్ లీగ్ ట్వంటీ20 టోర్నమెంట్ ప్రారంభ పోటీలలో ఐపిఎల్ జట్లు ఓడిపోవడం న్యూ సౌత్ వేల్స్ (ఎన్ఎస్ డబ్ల్యు) జట్టు కెప్టెన్ సైమన్ కటిచ్ కు విస్మయం కలిగించింది. కాని ఈ టోర్నీలో భారతీయ జట్లు త్వరలోనే తమ సత్తా చాటగలవని అతను భావిస్తున్నాడు.
దేశీయ పరిస్థితులలో ఆడుతున్న మూడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) జట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, డక్కన్ చార్జర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ తమ తొలి పోటీలలోనే పరాజయాన్ని చవి చూశాయి.
అయితే, ఈ గాయపడిన ఐపిఎల్ సింహాలను చులకన చేయడం పెద్ద పొరపాటే అవుతుందని కటిచ్ అభిప్రాయపడుతున్నాడు. టోర్నమెంట్ లో మిగిలిన పోటీలలో అవి కచ్చితంగా తమ సత్తా ప్రదర్శించగలవని అతను విశ్వసిస్తున్నాడు. 'భారతీయ జట్లు తమ తొలి పోటీలలో ఓడిపోవడం చూసి ఆశ్చర్యపోయాను. ముఖ్యంగా స్వదేశీ పరిస్థితులలో ఆడుతూ అవి ఈ ఫలితాన్ని చవి చూడడం ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఇతర జట్ల కన్నా ఈ పరిస్థితులు వాటికి బాగా అనువైనవి' అని అతను పేర్కొన్నాడు. 'అయితే, ఈ తరహా క్రికెట్ లో ఏ జట్టునూ తేలికగా తీసుకోలేము. భారతీయ జట్లు తమ రెండవ మ్యాచ్ లలో విజృంభిస్తాయని నా నమ్మకం' అని కటిచ్ ఆదివారం న్యూఢిల్లీలో విలేఖరులతో చెప్పాడు. సస్సెక్స్ జట్టుపై 35 పరుగుల ఆధిక్యంతో తన సారథ్యంలో ఎన్ఎస్ డబ్ల్యు జట్టు సూపర్ ఎయిట్ దశకు చేరుకున్న అనంతరం అతను విలేఖరులతో మాట్లాడాడు.
సస్సెక్స్ షార్క్స్ జట్టు తాత్కాలిక కెప్టెన్ ఎడ్ జాయ్సీ కూడా కటిచ్ అభిప్రాయంతో ఏకీభవించాడు. 'ఇంకా ఇవి తొలి రోజులే. ఐపిఎల్ జట్లు ఒక గేము ఆడాయి. తమ తదుపరి పోటీలో అవి మరింత బాగా రాణించగలవని నా నమ్మకం' అని అతను పేర్కొన్నాడు. (వారి మాటలు నిజం చేస్తున్నట్లుగా ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తమ రెండవ పోటీలో ఆదివారం శ్రీలంక వయాంబా జట్టుపై సునాయాసంగా విజయం సాధించింది.)
News Posted: 12 October, 2009
|