ట్రినిడాడ్ టొబాగో విజయం బెంగళూరు : చాంపియన్స్ టి -20 లీగ్ లోని ఎ గ్రూప్ 8వ మ్యాచ్ ను ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టు కైవసం చేసుకుంది. ఇక్కడి ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఐపి ట్రినిడాడ్ అండ్ టొబాగో- ఐపి సోమర్ సెట్ జట్ల మధ్య సోమవారం ఈ మ్యాచ్ జరిగింది. కేవలం 8 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, 2 బౌండరీల సాయంతో వేగంగా అజేయంగా పరుగులు సాధించడమే కాకుండా, సోమర్ సెట్ జట్టులోని రెండు కీలక వికెట్లను కూడా తీసుకున్న ట్రినిడాడ్ అండ్ టొబాగో క్రీడాకారుడు షెర్వన్ గంగా ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ట్రనిడాడ్ అండ్ టొబాగో జట్టు కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ట్రినిడాడ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 7.50 రన్ రేటుతో 150 పరుగులు చేసింది.
సోమర్ సెట్ జట్టు 151 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగి శక్తి వంచన లేకుండా పోరాడింది. జట్టు బౌలర్లు కొంతలో కొంత బాగానే రాణించినప్పటికీ జండెర్ డె బ్రూన్ (43 నాటౌట్) తప్ప మిగిలిన బ్యాట్స్ మెన్ చేతులెత్తేయడంతో 106 పరుగుల వద్దే కుప్పకూలిపోయింది. బ్రూన్ ట్రినిడాడ్ అండ్ టొబాగో బౌలర్లపై ఇంచుమించు ఒంటరి పోరాటమే చేశాడనే చెప్పాలి. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లలోనూ కలిపి అత్యధిక స్కోరు చేసింది కూడా బ్రూనే. టూ డౌన్ లో క్రీజ్ వద్దకు వచ్చిన బ్రూన్ తన జట్టు బ్యాట్స్ ఇలా వచ్చి అలా పెవిలియన్ కు వెళ్ళిపోతున్నా మొక్కవోని ధైర్యంతో ఎదురు నిలిచాడు. అయినా బ్రూన్ శ్రమ ఫలించలేదు. చివరికి మ్యాచ్ ఫలితం ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టుకు అనుకూలంగా నిలిచింది.
జట్ల స్కోర్ల వివరాలు :
ఐపి ట్రినిడాడ్ అండ్ టొబాగో : లెండిల్ సిమ్మన్స్ - 22, విలియం పెర్కింగ్ - 20, డారెన్ బ్రావో - 9, డారెన్ గంగా - 23, డాయన్ బ్రావో - డకౌట్, డేనేష్ రామ్డిన్ - 39, కీరాన్ పొలార్డ్ - 12, రవి రాంపాల్ - 2, షెర్విన్ గంగా - 18 నాటౌట్, డేవ్ మొహమూద్ - డకౌట్, సామ్యూల్ బద్రీ - 1 నాటౌట్.
సోమర్ సెట్ : మార్క్యూస్ ట్రెస్కోథిక్ - 3, జస్టిన్ లాంగర్ - 15, క్రైగ్ కీస్వెటర్ - 4, జండెర్ డె బ్రూన్ - 43 నాటౌట్, అరుస్ సప్పయ్య - 6, పీటర్ ట్రెగో - 6, జేమ్స్ హిల్డెర్త్ - 0, బెన్ ఫిలిప్స్ - 5, అల్ఫాన్సో థామస్ - 9, మాక్స్ వాలర్ - 1, చార్ల్ విల్లోబీ - 0.
బౌలింగ్ :
సోమర్ సెట్ : చార్ల్ విల్లోబీ 3 వికెట్లు, అల్ఫాన్సో థామస్, మాక్స్ వాలర్ చెరో రెండేసి వికెట్లు తీసుకోగా బెన్ ఫిలిప్స్ ఒక వికెట్ పడగొట్టాడు.
ట్రినిడాడ్ అండ్ టొబాగో : డాయన్ బ్రావో 4 వికెట్లను తుత్తునియలు చేశాడు. షెర్విన్ గంగా, డేవ్ మొహమ్మద్ చెరో వికెట్ తీసుకున్నారు. జేమ్స్ హిల్డెర్త్, అల్ఫాన్సో థామస్ రన్నౌట్ అయ్యారు.
News Posted: 12 October, 2009
|