15న టీమ్ ఇండియా ఎంపిక ముంబై : ఆస్ట్రేలియాతో జరగనున్న ఏడు మ్యాచ్ ల వన్ డే సీరీస్ కోసం భారత క్రికెట్ జట్టును ఈ నెల 15న చెన్నైలో ఎంపిక చేస్తారు. 'ఒడిఐ బృందం ఎంపిక 15న చెన్నైలో జరుగుతుంది' అని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) వర్గాలు సోమవారం ముంబైలో ప్రకటించాయి.
దక్షిణాఫ్రికాలో ఇటీవల ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో భారత జట్టు ఆట తీరు పేలవంగా ఉండడంతో రానున్నసీరీస్ కోసం జట్టు ఎంపిక ఎలా ఉంటుందోనని అంతా ఎదురుచూస్తున్నారు. చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో ఇండియా ప్రాథమిక దశ నుంచి తిరుగు ముఖం పట్టవలసి వచ్చిన సంగతి విదితమే. చీఫ్ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మినహా మిగిలిన జాతీయ సెలక్టర్లు ఆదివారం నాగపూర్ లో ముగిసిన ఎన్.కె.పి. సాల్వే చాలెంజర్ సీరీస్ పోటీలను తిలకించారు. భారత జట్టుకు ఎలా బలం చేకూర్చాలో వారు నాగపూర్ టోర్నీ ద్వారా అవగాహనకు వచ్చి ఉండాలి.
ఒడిఐ సీరీస్ లో అక్టోబర్ 25న వడోదరాలో రిలయన్స్ (పూర్వపు ఐపిసిఎల్) స్టేడియంలో డే పోటీతో ప్రారంభమై నవంబర్ 11న నవీ ముంబైలోని డి.వై. పాటిల్ స్టేడియంలో చివరి డే నైట్ పోటీతో ముగుస్తుంది. ఈ రెండింటి మధ్యలో అక్టోబర్ 28న నాగపూర్ లోను, 31న ఢిల్లీలోను, నవంబర్ 2న మొహాలిలోను, 5న హైదరాబాద్ లోను, 8న గౌహతిలోను పోటీలు జరుగుతాయి. వీటిలో గౌహతి ఒక్కటే డే పోటీకి ఆతిథ్యం ఇస్తున్నది. మిగిలినవన్నీ డే నైట్ పోటీలే.
News Posted: 13 October, 2009
|