'వన్డేలపై పునరాలోచించండి' సిడ్నీ : నిరర్థకమైన 'డెడ్ రబ్బర్'లను అంతం చేయడానికి వన్ డే క్రికెట్ పై పునరాలోచన జరపాలని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ రిక్కీ పాంటింగ్ కోరాడు. భారతదేశంలో ఏడు గేముల వన్ డే అంతర్జాతీయ (ఒడిఐ) సీరీస్ కోసం బయలుదేరుతూ పాంటింగ్ ఈ అభ్యర్థన చేశాడు. అన్ని వన్ డే పోటీలకు 'చెప్పుకోదగిన ప్రాముఖ్యం' లభించేందుకు పాయింట్ల విధానం ఒకటి రూపొందించవలసిన ఆవశ్యకత ఉందని పాంటింగ్ సూచించాడు. క్రితం నెల ఇంగ్లండ్ జట్టుకు, ఆస్ట్రేలియా జట్టుకు మధ్య ఏకపక్షంగా సాగిన ఏడు పోటీల ఒడిఐ సీరీస్ ను ప్రస్తావిస్తూ అతను ఈ సూచన చేశాడు. ఆసీస్ జట్టు 6-1తో సీరీస్ ను గెలుచుకున్న విషయం విదితమే.
'ఈ విధమైన సీరీస్ తో వన్ డే క్రికెట్ ను ప్రస్తుతం నిర్వహిస్తున్న తీరును పరిగణనలోకి తీసుకుంటే పాయింట్ల విధానాన్ని ప్రవేశపెట్టేంత వరకు యుకె పరిస్థితే పునరావృతం కావచ్చు' అని పాంటింగ్ అభిప్రాయం వెలిబుచ్చాడు. 'నాలుగు గేముల తరువాత మేము 4-0 ఆధిక్యంతో ఉన్నాం. దీనితో జట్లు క్రీడాకారులను వంతులవారీగా ఆడించవచ్చునంటూ ఊహాగానాలు ప్ర్రారంభమయ్యాయి. అందువల్ల 50 ఓవర్ల క్రికెట్ లో ప్రతి గేముకూ ఎంతో కొంత ప్రాముఖ్యం ఉండేట్లు మనం చూడడం ప్రధానమని నా భావన' అని అతను పేర్కొన్నాడు.
ఇది ఇలా ఉండగా, వన్ డే ర్యాంకింగ్ లలో అగ్ర స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు ఇండియా కన్నా కేవలం నాలుగు పాయింట్ల ఆధిక్యం ఉంది. ఈ నెల దక్షిణాప్రికాలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో ఇండియా గ్రూప్ దశలోనే తిరుగుముఖం పట్టిన విషయం విదితమే. అయితే, 'ఇండియాలో వారిని ఓడించడం చాలా కష్టం' అని పాంటింగ్ చెప్పాడు. 'ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పటి కన్నా వారు స్వదేశంలోనే ఎంతో మెరుగ్గా ఆడతారు' అని పాంటింగ్ అన్నాడు.
News Posted: 20 October, 2009
|