ఫైనల్లో ట్రినిడాడ్ హైదరాబాద్ : పిల్ల జట్టుగా అందరూ భావించిన జట్టే పిడుగులు కురిపిస్తోంది. వీర దూకుడుగా ఆడుతూ వరస విజయాల పరంపరను కొనసాగిస్తూ చాంపియన్స్ లీగ్ లో ఫైనల్ చేరింది. అదే ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టు. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం ఐపి కోబ్రాస్ తో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో 7 వికెట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలి సెమీఫైనల్ విజేత న్యూ సౌత్ వేల్స్ జట్టుతో శుక్రవారంనాడు ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఉరకలు వేస్తోంది. 34 బంతుల్లో మూడు సిక్సర్లు, 4 బౌండ్రీల సాయంతో 58 పరుగులతో నాటౌట్ బ్యాట్స్ మన్ గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టు క్రీడాకారుడు డాయన్ బ్రావో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గౌరవాన్ని అందుకున్నాడు.
టాస్ గెలిచిన కోబ్రాస్ జట్టు కెప్టెన్ ఆండ్రూ పుటిక్ ముందుగా బ్యాటింగ్ ను తీసుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో కోబ్రాస్ ఐదు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గా బరిలో దిగిన కెప్టెన్ ఆండ్రూ పుటిక్ 13 బంతుల్లో 10 పరుగులు చేసి ఎస్. గంగా బౌలింగ్ లో వికెట్ ను అప్పగించి వెనుదిరిగాడు. ఆట 6.4వ ఓవర్ వద్ద ఒన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన హెన్రీ డేవిడ్స్ 7 బంతుల్లో 7 పరుగులు చేసి జట్టు స్కోరు 57 పరుగుల వద్ద ఉండగా మొహమ్మద్ కు కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. 9.1వ ఓవర్ లో రెండో ఓపెనర్ హెర్చెల్లీ గిబ్బిస్ 27 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, 5 బౌండ్రీల సాయంతో 42 పరుగులు చేసి పొల్లార్డ్ కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పడు కోబ్రాస్ జట్టు స్కోర్ 82 పరుగులు. రోరి క్లీన్ వెల్ట్ రెండు సిక్సర్లతో 21, జస్టిన్ ఒంటాంగ్ 7 పరుగులు చేశారు. జెపి డుమిని 40 బంతులు ఎదుర్కొని 3 సిక్సర్లు, 4 బౌండ్రీల సాయంతో 61 పరుగులు, వెర్మాన్ ఫిలాండర్ 1 సిక్సర్ సాయంతో 13 పరుగులు చేసిన నాటౌట్ బ్యాట్స్ మెన్ గా నిలిచారు. మొత్తం మీద కోబ్రాస్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది.
ట్రినిడాడ్ బౌలింగ్ లో లెండిల్ సిమ్మన్స్ 2 వికెట్లు పడగొట్టాడు. షెర్విన్ గంగ, డేవ్ మొహమ్మద్, కీరోన్ పొల్లార్డ్ తలో వికెట్ తీసుకున్నారు.
176 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ట్రినిడాడ్ అండ్ టొబాగో ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ట్రినిడాడ్ ఓపెనింగ్ బ్యాట్స్ మన్ విలియం పెర్కిన్స్ 16 బంతుల్లో 4 బౌండ్రీల సాయంతో 20 పరుగులు చేసి ఆట 4.6వ ఓవర్ వద్ద క్లీన్ వెల్ట్ ఫీల్డింగ్ లో రన్నౌట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 53 పరుగులు ఉంది. ఆట 6.1వ ఓవర్ వద్ద జట్టు స్కోర్ 58 పరుగుల వద్ద ఉండగా డామిని వేసిన బంతికి మరో ఓపెనింగ్ బ్యాట్స్ మన్ అడ్రియన్ బరత్ ఎల్ బిడబ్ల్యు అయ్యాడు. 16 బంతులు ఆడిన బరత 2 సిక్సర్లు, 4 బౌండ్రీల సాయంతో 29 పరుగులు చేశాడు. ఒన్ డౌన్ లో క్రీజ్ వద్దకు వచ్చిన లెండిల్ సిమ్మన్స్ ఆట 10.1వ ఓవర్ వద్ద ఓంటాంగ్ బంతిని క్లీన్ వెల్ట్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 20 బంతులు ఎదుర్కొన్న సిమ్మన్స్ ఒక సిక్సర్ తో కలిపి 20 పరుగులు చేశాడు.
ఇక జట్టుకు విజయ ఫలాన్ని అందించే పనిలో కెప్టెన్ డారెన్ గంగ, డాయన్ బ్రావో తీసుకున్నారు. 31 బంతుల్లో 2 సిక్సర్లు, ఒక బండ్రీతో 44 పరుగులు చేసిన డారెన్ గంగ, 34 బంతులు ఆడి 3 సిక్సర్లు, 4 బౌండ్రీలతో 58 పరుగులు చేసిన బ్రావో నాటౌట్ బ్యాట్స్ మెన్ గా నిలిచారు. మొత్తం మీద ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టు 19.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.
కోబ్రాస్ జట్టు బౌలింగ్ లో జెపి డామిని, జస్టిన్ ఓంటాంగ్ చెరో వికెట్ తీసుకోగా విలియం పెర్కిన్స్ ను క్లీన్ వెల్ట్ రన్నౌట్ చేశాడు.
News Posted: 23 October, 2009
|