చాంపియన్ న్యూసౌత్ వేల్స్ హైదరాబాద్ : తొలి నుంచీ ఉరకలు వేసిన ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టు ఆఖరి ఫలితాన్నిచ్చే మ్యాచ్ లో అదే ఉరవడిని కొనసాగించలేకపోయింది. న్యూ సౌత్ వేల్స్ జట్టు చేతిలో 41 పరుగుల తేడాతో అపజయాన్ని మూటగట్టుకుంది. 6.06 కోట్ల ప్రైజ్ మనీతోనే సరిపెట్టుకుంది. న్యూ సౌత్ వేల్స్ జట్టు ఆల్ రౌండ్ ప్రతిభ ముందు ట్రనిడాడ్ తల వంచక తప్పలేదు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సీరీస్ బహుమతులను న్యూ సౌత్ వేల్స్ జట్టులో ఆల్ రౌండ్ ప్రతిభ ప్రదర్శించిన బ్రెట్ లీ ఎగరేసుకుపోయాడు. 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ట్రినిడాడ్ 15.5 ఓవర్లలో 118 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అవడంతో తుది ఫలితం, ట్రోఫీ న్యూ సౌత్ వేల్స్ జట్టు ఒడిలో చేరింది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం జరిగిన చాంపియన్స్ టి 20 లీగ్ ఫైనల్ లో న్యూ సౌత్ వేల్స్ జట్టు చాంపియన్ గా నిలిచింది.
అంతకు ముందు టాస్ గెలిచిన ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టు కెప్టెన్ డారెన్ గంగ ముందుగా ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. గంగ ఆహ్వానం మేరకు బరిలో దిగిన న్యూ సౌత్ వేల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. రెండు జట్లలోనూ కలిపి ఏ ఒక్కరూ అర్ధ సెంచరీ చేయకపోవడం గమనార్హం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సీరీస్ అవార్డులు అందుకున్న బ్రెట్ లీ మాత్రమే అర్ధ శతకానికి చేరువ (48 పరుగులు) అయ్యాడు.
160 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టు క్రీడాకారులు న్యూ సౌత్ వేల్స్ బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయారు. 15.5 ఓవర్లలో 118 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. ఒక్క బ్యాట్స్ అయినా కనీసం మూడు పదుల సంఖ్య చేరలేక చతికిలపడ్డారు.
స్కోరు వివరాలు :
న్యూ సౌత్ వేల్స్ : డేవిడ్ వార్నర్ -19, ఫిలిప్ హగీస్ - 3, సైమన్ కటిచ్ - 16, మోజెస్ హెన్రిక్స్ - 4, బెన్ రోరెర్ - 16, స్టీవెన్ స్మిత్ - 33, డేనియల్ స్మిత్ - 3, బ్రెట్ లీ - 48, నాథన్ హారిట్జ్ - 10 (రన్నౌట్), స్టువర్ట్ క్లార్క్ - 0 నాటౌట్.
ట్రినిడాడ్ అండ్ టొబాగో : విలియం పెర్కిన్స్ - 0, అడ్రియన్ బరత్ - 14, లెండిల్ సిమ్మన్స్ - 4, డారెన్ గంగ - 19, డాయన్ బ్రావో - 17, డెనేష్ రామ్ దిన్ - 16, కీరాన్ పోలార్డ్ - 26, షెర్విన్ గంగ - 5, నేవిన్ స్టీవార్ట్ - 4, డేవ్ మొహమ్మద్ - 1, రవి రాంపాల్ - 0 నాటౌట్.
బౌలింగ్ :
ట్రినిడాడ్ అండ్ టొబాగో : రవి రాంపాల్ 3, డాయన్ బ్రావో 2, షెర్విన్ గంగ 1, కీరాన్ పోలార్డ్ 1, డేవ్ మొహమ్మద్ 1.
న్యూ సౌత్ వేల్స్ : స్టువర్ట్ క్లార్క్ 3, బ్రెట్ లీ 2, స్టీవెన్ స్మిత్ 2, నాథన్ హారిట్జ్ 2, డగ్ బోలింగర్ 1.
News Posted: 24 October, 2009
|