పోరాడి ఓడిన భారత్ వడోదర : గెలుపు వాకిట చతికిలపడింది భారత క్రికెట్ జట్టు. స్టార్ లు ఉన్న టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ విఫలం అయితే, టైలెండర్లయిన హర్భజన్ సింగ్, ప్రవీణ్ కమార్ సాగించిన వీరోచిత పోరాటం కూడా ఒటమిని తప్పించలేకపోయింది. సంచలన విజయానికి చేరువకు వచ్చి కేవలం నాలుగు పరుగుల దూరంలో ఆగిపోయింది. చివరిలో నరాలు తెగే ఉత్కంఠను రేపిన ఆటలో ఫలితం మాత్రం ఉస్సూరుమనిపించింది. ఆఖరి ఆరుబంతులూ కూడా హరిభజన్ సింగ్ ఆడి ఉంటే ఆస్ట్రేలియా భరతం పట్టిండువాడనే భారమైన భావనను మిగిల్చింది. భారత-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఏడు వన్డేల సీరీస్ లోభాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్ లో విజయాన్ని సాధించి అతిథ్య జట్టు ముందంజ వేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఇచ్చిన 293 పరుగుల లక్ష్యానికి కనీసం చేరువలోకి లోకి కూడా రాలేరనిపించింది. 201 పరుగులకే ఏడు కీలకమైన వికెట్లు కోల్పోయిన భారత్ కు ఘోర పరాజయం తప్పదనిపించింది. అప్పుడు రంగంలోకి దిగిన హరిభజన్, అంతకు కొద్ది బంతుల ముందే వచ్చిన ప్రవీణ్ కు జతకలిశాడు. ఇద్దరూ కలిసి కంగారూలకు కంగారు పుట్టించారు. బంతులకు చుక్కలు చూపించారు. బాదుడును ముందుగా ప్రవీణ్ ప్రారంభించాడు. ఎప్పుడూ అస్ట్రేలియా మీద కసితో విరుచుకుపడే హరిభజన్ ఈసారీ బౌలర్ల భరతం పట్టాడు. వీరిద్దరూ కేవలం 57 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అర్ధ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో చివరి ఒవర్ మొదటి బంతికి హర్భజన్ పెవిలియన్ కు చేరడంతో చివరి ఐదు బంతుల్లో ఏడు పరుగులు చేయాల్సిన భారత్ కేవలం మూడు పరుగులే రాబట్టగలిగింది. ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది.
ప్రవీణ్ 40 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. గంభీర్ 68 పరుగులు, విరాట్ కోహ్లీ 30 పరుగులు, కెప్టెన్ ధోని 34 పరుగులకు, సెహ్వాగ్, సచిన్ లు రాణించకపోవడంతో ఎనిమిది వికెట్ల నష్టానికి 50 ఓవర్లకు భారత జట్టు 288 పరుగులు చేయగలిగింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టులో కెప్టెన్ పాంటింగ్ 74, మైక్ హస్సీ 73, టిమ్ పైన్ 50 కామరూన్ వైట్ 51 పరుగులు సాధించడంతో ఎనిమిది వికెట్లకు 292 పరగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఈ రెండు జట్లు ఈనెల 28 వ తేదీన నాగ్ పూర్ ల డే అండ్ నైట్ మ్యాచ్ గా జరిగే రెండో వన్డేలో తలపడతాయి.
News Posted: 25 October, 2009
|