నాల్గో వన్డే ఆస్ట్రేలియాదే మొహాలి : విజృంభించిన హర్భజన్ ను చూసి కాస్సేపు బిత్తర పోయిన ఆస్ట్రేలియా తేరుకుని, మ్యాచ్ ను తన వైపు తిప్పుకుని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ పిసిఎ స్టేడియంలో సోమవారం నాడు జరిగిన నాల్గో వన్డేలో భారత్ పై 24 పరుగుల తేడాతో విజయం సాధించి ఏడు మ్యాచ్ ల సిరీస్ ను 2-2 తో సమం చేయడమే కాదు ఐసిసి ర్యాంకింగ్ లో తన ప్రధమ స్ధానాన్ని కాపాడుకుంది. ఇండియా టాస్ గెలిచి ఆతిధ్య జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ వ్యూహం ఫలించినట్టే కనిపించింది. మొదటి ఇన్నింగ్స్ లో పరుగులు రావడమే గగనమైపోయింది.
అయినా వికెట్లను కాపాడుకున్న ఆస్ట్రేలియా 196 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి పటిష్టంగా కనిపించింది. కానీ తరువాత నాలుగు వికెట్లను కేవలం 27 పరుగుల వ్యవధిలో పొగొట్టుకుని 49.2 ఓవర్లకు 250 పరుగుల వద్ద అలౌట్ అయింది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాటింగ్ 52 పరుగులు, వైట్ 62, వాట్సన్ 49 పరుగులు, హస్సీ 40 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా ఒక మోస్తరు లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. 37 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్న నెహ్రా మరోసారి మెరిశాడు. రెండు వికెట్లు తీసుకుని హర్భజన్ సింగ్ తాను పుంజుకున్నట్లు సంకేతాలు ఇవ్వగలిగాడు.
స్టార్ బ్యాట్స్ మెన్ల సమూహం ఉన్న టీమిండియా అలవోకగానే నెగ్గుతుందన్న నమ్మకాన్ని డేరింగ్ సెహ్వాగ్ కలిగించాడు. 19 బంతుల్లోనే 30 పరుగులు చేసి స్కోర్ బోర్డును శరవేగంతో పరుగులెత్తించాడు. కానీ ఏడో ఓవర్లో పెవిలియన్ కు చేరిపోయాడు. 47 పరుగులు చేస్తే వన్డేల్లో 17 వేల పరుగుల మైలురాయిని దాటి రికార్డు సృష్టిస్తాడని ఎదురుచూసిన అభిమానులను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నిరాశ పరిచాడు. సెహ్వాగ్ అవుటయిన తరువాత ఆచీతూచీ ఆడిన సచిన్ 40 పరుగులకే ఎల్ బి డబ్ల్యుగా వెనుతిరిగాడు. ప్రపంచ నంబర్ వన్, టూ లు ఉన్న మిడిలార్డర్ ఢిల్లీ విన్యాసాన్ని ఇక్కడ చేయలేకపోయింది.
విరాట్ కోహ్లి,యువరాజ్, మహేంద్రసింగ్ ధోని లాంటి హేమాహేమీలు నిష్క్రమించినా టర్బనేటర్ హర్భజన్ సింగ్ కంగారూలను కాస్సేపు కంగారెత్తించాడు. ఒక దశలో హర్భజన్ మ్యాచ్ ను భారత్ వైపు తిప్పుతున్నాడన్న ఆనందాన్ని ఇచ్చాడు. 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి చాప చుట్టేస్తారని అనుకుంటే ఓటమిని మరోసారి గౌరవ ప్రదంగా మార్చడంలో హర్భజన్ విజయం సాధించాడు. రవీంద్ర జడేజా, ప్రవీణ్ కుమార్, ఆశిష్ నెహ్రా కాస్సేపు ప్రతిఘటించి అపజయాన్ని ఆలస్యం చేయగలిగారు. భారత్ ఓటమికి ఆస్ట్రేలియా బౌలర్లు వాట్సన్(3-29), డౌగ్ బొల్లింగర్(3-35) ప్రధాన కారకులయ్యారు.
News Posted: 2 November, 2009
|