బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ హైదరాబాద్ : ఏడు వన్డేల హీరోహోండా కప్ సీరీస్ లో భాగంగా ఐదో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ను ఎంచుకుంది. హైదరాబాద్ శివారు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం ఈ వన్డే డే అండ్ నైట్ మ్యాచ్ గా జరుగుతోంది. ఇంతకు ముందు జరిగిన నాలుగు వన్డేలలోనూ ఇరు జట్లూ చెరో రెండు మ్యాచ్ లు గెలిచి సమాన స్థితిలో ఉన్నాయి. దీనితో రెండు జట్లూ ఐదో వన్డే 'డూ ఆర్ డై' అనే రీతిలో సర్వ శక్తులు ఒడ్డి పోరాడే అవకాశముంది. ఈ సీరీస్ లో హైదరాబాద్ వన్డే గెలిచిన జట్టు కన్నా ప్రత్యర్థి జట్టుపైనే చివరి రెండు మ్యాచ్ లలో ఒత్తిడి అధికం అవుతుంది. అందుకే రెండు జట్లూ హోరాహోరీ పోరాటం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
కాగా, ఈ వన్డేలో భారత్, ఆస్ట్రేలియా రెండేసి మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. ఇషాంత్ శర్మ స్థానంలో మునాఫ్ పటేల్ ను, కొహ్లీ స్థానంలో గౌతం గంభీర్ కు భారత జట్టులో స్థానం కల్పించారు. ఆసీస్ జట్టులో మిచెల్ జాన్సన్, హెన్రిక్ స్థానంలో ఆడం వోగ్స్, క్లింట్ మెక్ కె లను తీసుకున్నారు.
మరో ఏడు పరుగులు చేస్తే టీమిండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ అరుదైన రికార్డు అంతర్జాతీయ వన్డేల్లో 17 వేల పరుగులను చేరుకుంటాడు. దీనితో మైదానంలోనే కాకుండా అంతర్జాతీయంగా క్రికెట్ అభిమానుందరి చూపూ మాస్టర్ బ్లాస్టర్ పైనే ఉంది. మరో పక్కన సెంచరీల హ్యాట్రిక్ యువరాజ్ సింగ్ ను ఊరిస్తోంది. ఉప్పల్ స్టేడియం యువీకి అచ్చొచ్చింది. అటు సచిన్ ప్రపంచ రికార్డుకు, ఇటు యువీ హ్యాట్రిక్ కు ఉప్పల్ స్టేడియం వేదిక కానున్నదో లేదో కొద్ది గంటల్లోనే తేలుతుంది.
ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటన ఏడు వన్డేల సీరీస్ లో భాగంగా హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో అతి కీలకమైన ఐదవ డే అండ్ నైట్ మ్యాచ్ జరుగుతుండడంతో నగరంలో ఎల్లెడలా క్రికెట్ మానియా నెలకొన్నది.
News Posted: 5 November, 2009
|