హెచ్ సిఎపై కోమటిరెడ్డి కినుక హైదరాబాద్ : టీమిండియా - ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం జరుగుతున్న ఐదో వన్డే టిక్కెట్లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బ్లాక్ లో విక్రయించిందని వచ్చిన వార్తలపై రాష్ట్ర ఐటి, క్రీడల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. హెచ్ సిఎ కనీస ప్రోటోకాల్ కూడా పాటించకుండా తన ఇష్టం వచ్చిన తీరులో వ్యవహరిస్తోందని ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. హెచ్ సిఎ తీరుకు నిరసనగా ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్ ను చూడకుండా ఆయన బహిష్కరించారు. ఉప్పల్ స్టేడియానికి వెళ్ళకుండా అలక వహించిన మంత్రిని కలిసిన మీడియా ప్రతినిధుల వద్ద ఆయన పై విధంగా స్పందించారు.
హెచ్ సిఎ అధ్యక్షుడు జి. వినోద్ తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని కోమటిరెడ్డి కస్సుమన్నారు. క్రీడల శాఖ మంత్రి అయిన తనకు కూడా వినోద్ అందుబాటులో లేకుండా తప్పించుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ స్టేడియం కోసం దివంగత ముఖ్యమంత్రి 200 కోట్లు రూపాయల విలువైన స్థలాన్ని ఇచ్చినా దాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు సద్వినియోగం చేసుకోవడం చేతకాలేదని మంత్రి కోమటి రెడ్డి ఎద్దేవా చేశారు. త్వరలోనే బిసిసిఐతో తాను సమావేశమై హెచ్ సిఎ వ్యవహారంపై చర్చిస్తానని ఆయన స్పష్టం చేశారు. కాగా, గత రెండు రోజులుగా హెచ్ సిఎపై వస్తున్న బ్లాక్ టిక్కెట్ల వ్యవహారంపై బిసిసిఐకి క్రీడల మంత్రి కోమటిరెడ్డి లేఖ రాశారు.
News Posted: 5 November, 2009
|