సచిన్ సరికొత్త రికార్డు హైదరాబాద్ : రికార్డుల వీరుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో లిఖించుకున్నాడు. క్రికెట్ చరిత్రలో మరెవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగాడు. వన్డేల కెరీర్ లో 17,000 పరుగుల మైలురాయిని సచిన్ చేరుకున్నాడు. 17 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా జట్టుతో గురువారం హైదరాబాద్(ఉప్పల్)లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఐదవ వన్డేలో సచిన్ ఈ రికార్డును నమోదు చేసుకున్నాడు. సచిన్ రికార్డు కోసమే ఎదురు చూస్తున్న క్రీడాభిమానులు ఒక్కసారిగా ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. సచిన్ సరికొత్త రికార్డులో 44 సెంచరీలు, 91 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 435 వన్డేలు ఆడిన సచిన్ ఈ మైలు రాయిని దాటాడు.
అయితే, సచిన్ కు ఈ రికార్డు సాధించడానికి రెండు దశాబ్దాలు పట్టింది. 1973 ఏప్రిల్ 24న జన్మించిన సచిన్ 1989 నవంబర్ 5న భారత క్రికెట్ జట్టులో తొలిసారిగా స్థానం సంపాదించాడు. అతి చిన్న వయస్సులోనే భారతజట్టులో స్థానం సంపాదించిన క్రీడాకారుడిగా రికార్డులకెక్కిన మాస్టర్ బ్లాస్టర్ రెండు దశాబ్దాల క్రికెట్ కెరీర్ లో వెనక్కి తిరిగి చూడలేదు. రికార్డుల మీద రికార్డులు సాధిస్తూనే ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదిగాడు.
News Posted: 5 November, 2009
|