సీరీస్ అస్ట్రేలియా కైవసం గౌహతి : వన్డే సీరీస్ ను ఆస్ట్రేలియా పండులా ఎగరేసుకుపోయింది. వరల్డ్ క్లాస్ బ్యాట్స్ మెన్ లతో క్రిక్కిరిసిపోయిన టీమిండియా ఘోరమైన ఆట తీరుతో, వ్యూహాలతో చేజేతులా పరాజయాన్ని మూటగట్టుకుంది. కీలకమైన, గెలిచితీరాల్సిన అరో వన్డేలో అంతుబట్టని వికెట్ మీద మొదట బ్యాటింగ్ తీసుకున్న భారత్ జూదం ఫలించలేదు. ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయి ఏడు వన్డేల సీరీస్ ను 4-2 తేడాతో కోల్పోయింది. ఆదివారం ఉదయం టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆశ్చర్యకరంగా బ్యాటింగ్ ను తీసుకున్నాడు. క్రికెట్ కు ప్రతికూలమైన వాతావరణం భారత్ వెన్నువిరిచింది. ప్రారంభంలో తగిలిన దెబ్బల నుంచి భారత్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. చక్కగా మ్యాచ్ ను ఆతిధ్య జట్టుకు అప్పగించింది.
నిక్కచ్చైన ప్రోఫెషనల్ గేమ్ తో ప్రపంచ చాంపియన్లు ఆయాచితంగా లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. భారత్ ను 48 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌట్ చేసి ఆ లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 41.5 ఓవర్లలోనే అందుకున్నారు. గౌహతి పిచ్ పై బంతి మెలికలు తిరిగినా ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు వాట్సన్ బంతికో పరుగు చొప్పున 49, కెప్టెన్ పాంటింగ్ 25, కేమెరాన్ వైట్ 25 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువకు తీసుకువెళ్ళారు. హస్సీ 35, ఆడమ్ వోగెస్ 23 పరుగులతో నాటౌట్ గా ఉండి విజయాన్ని పూర్తి చేశారు.
మొదట బ్యాటింగ్ తీసుకున్న భారత్ కు ఆరంభం నుంచీ భయానక కథే మిగిలింది. వ్యూహం బెడిసికొట్టింది. తొలి తొమ్మిది ఓవర్లలోనే ఐదు వికెట్లు కొల్పోయి 27 పరుగులు మాత్రమే చేసింది. ఆ దశలో స్కోరు మూడంకెలకు చేరుతుందనే నమ్మకమే ఎవ్వరికీ లేదు. కానీ అదృష్టవశాత్తూ రవీంద్రజడేజా(57), ప్రవీణ్ కుమార్(54 నాటౌట్) ఆపద్భంధవుల్లా ఆడటంతో ఆ మాత్రం పరువైనా నిలచింది. ప్రవీణ్ కుమార్ వన్డేల్లో తొలి అర్ధసెంచరీ చేయడం విశేషం. భారత్ ఇన్నింగ్స్ ను బొల్లింగర్(5/35), మిచెల్ జాన్సన్(3/39) అద్భుత బౌలింగ్ తో శాసించారు. ఏడో వన్డే ముంబయిలో బుధవారం జరుగుతుంది.
News Posted: 8 November, 2009
|