పావు గంటలో కొలాప్స్: ధోనీ గౌహతి : పీడకలగా మిగిల్చిన ఆరో మ్యాచ్ లో మొదటి పదిహేను నిముషాలు పిచ్ స్వభావాన్ని అర్దం చేసుకోవడంలో బ్యాట్స్ మెన్లు విఫలం అయ్యారని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని వాపోయాడు. మొదటి పావుగంటలోనే జరగవలసిన నష్టం జరిగిపోయిందని, ఏకంగా ఆరు వికెట్లు కోల్పోయామని ధోనీ వివరించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వ్యూహం బెడిసి కొట్టడంతో ఇప్పుడు నెపం బ్యాట్స్ మెన్ల పైకి నెడుతున్నాడు. కొత్త బంతిని ఎదుర్కోలేకపోయిన టీమిండియా 31 ఓవర్లలో 75 పరుగులు మాత్రమే చేసి ఏడు వికెట్లు పోగొట్టుకుంది. ఏడు వన్డేల హీరోహోండా కప్ సీరీస్ ను ఆస్ట్రేలియా 4-2 తేడాతో ఎగరేసుకుపోయింది. 27 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి దయనీయమైన స్థితిలో ఉన్న భారత్ జట్టులో రవీంద్ర జడేజా(57), ప్రవీణ్ కుమార్(54 నాటౌట్) బాధ్యతగా ఆడి పరువు నిలబెట్టారు. వంద పరుగులు కూడా చేయదనుకున్న భారత్ ను 170 పరుగుల వద్దకు చేర్చారు.
మొదటి పదిహేను నిముషాల్లోనే అంతా అయిపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. పిచ్ పై బంతి స్వింగ్ అవుతోంది. దానిని వారు పూర్తిగా వినియోగించుకున్నారని ధోనీ అన్నాడు. నాగపూర్, మొహాలీల్లో మంచి విజయాలు సాధించిన జట్టు ఈ రీతిలో ఓడిపోవడం బాధాకరమని వ్యాఖ్యానించాడు. ఈ ఘనత ఆస్ట్రేలియాదే. మా నుంచి మ్యాచ్ ను వారు లాక్కునిపోయారని ధోనీ అన్నాడు. కాగా ఈ సీరీస్ విజయం తనకు చాలా సంతృప్తిని ఇచ్చిందని ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ చెప్పాడు. గాయాల బారిన పడి ఆటగాళ్లు కరవైపోయారు. నాలుగు మ్యాచ్ లు పూర్తయ్యేసరికి ఐదుగురు ఆటగాళ్ళు వెళ్ళిపోయారు. ఒక దశలో మైదానంలోకి పదకొండు మంది సభ్యులను తీసుకురావడమే కష్టమైపోయింది. అయినా సీరీస్ ను గెలవడం సంతోషాన్నిచ్చిందని పాంటింగ్ చెప్పాడు.
News Posted: 9 November, 2009
|