ఇప్పుడు సైనా నంబర్ 6 ముంబై : డెన్మార్క్, ఫ్రెంచ్ సూపర్ సీరీస్ టోర్నీలలో క్వార్టర్ ఫైనల్స్ రౌండ్ కు చేరుకున్న ఫలితంగా ప్రముఖ హైదరాబాదీ షట్లర్ సైనా నెహ్వాల్ తాజా ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ లలో రెండు స్థానాలు పురోగమించి ఆరవ స్థానంలో నిలిచింది. అయితే, 'అందులో కొత్తేమీ లేదు' అని నవ్వుతూ సైనా అన్నది. ఆమె గత ఆగస్టులో ప్రపంచ చాంపియన్ షిప్స్ సమయంలో కూడా టాప్ ఫైవ్ దరిదాపుల్లోకి వచ్చింది.
'ఈ సీజన్ ముగిసే లోగా నేను ఇంకా రెండు సూపర్ సీరీస్ టోర్నీలు ఆడవలసి ఉంది. కాని ఈ సంవత్సరాంతానికి టాప్ ఫైవ్ చేరుకొని తీరాలనే ఉద్దేశంతో మాత్రం లేను. నాకు నేను ఎటువంటి లక్ష్యాలూ నిర్దేశించుకోను' అని సైనా ఢిల్లీ నుంచి ఫోన్ లో 'టైమ్స్ ఆఫ్ ఇండియా ' (టిఒఐ) విలేఖరితో చెప్పింది. నవంబర్ 10న ప్రారంభం కానున్న 2.50 లక్షల డాలర్ల టోర్నీ కోసం హాంకాంగ్ వెళ్ళేందుకై కనెక్టింగ్ విమానం కోసం ఆమె ఢిల్లీ చేరుకున్నది. ఆతరువాత నవంబర్ 17 నుంచి 22 వరకు షాంఘైలో జరిగే చైనా ఓపెన్ లో సైనా పాల్గొంటుంది. ఈ సీజన్ ముగింపుగా ఎనిమిది మంది క్రీడాకారిణులు పాల్గొనే సూపర్ సీరీస్ మాస్టర్స్ ఫైనల్స్ కు సైనా ఇదివరకే అర్హత పొందింది. ఆ టోర్నీ డిసెంబర్ 2 నుంచి 6 వరకు కౌలాలంపూర్ లో జరుగుతుంది.
News Posted: 9 November, 2009
|