'మెరీనా' క్రికెట్ ఇక లేదు చెన్నై : ప్రపంచంలో రెండవ పెద్ద బీచ్ అయిన చెన్నై మెరీనా బీచ్ లో క్రికెట్ ఆడడంపై నగర పోలీసులు నిషేధం విధించిన రెండు రోజుల తరువాత నిషేధం కచ్చితంగా అమలు జరిగేట్లు చూడడానికై అధిక సంఖ్యలో పోలీస్ సిబ్బందిని నియోగించారు. మెరీనా బీచ్ పొడుగునా గస్తీ వ్యాన్లతో పాటు లాఠీలు ధరించిన పోలీసులు కనిపిస్తున్నారు. బీచ్ ఇన్నర్, సర్వీస్ రోడ్లపై వారు కాపలా కాస్తున్నారు. సెలవు రోజులు, వారాంతపు రోజులలోను స్థానికులు ఎక్కువగా క్రికెట్ ఆడుకునేది మెరీనా బీచ్ లోనే.
క్రికెట్ ఆడేందుకు అమిత ఉత్సాహంతో బీచ్ కు వస్తున్నవారిని పోలీసులు ఆపివేసి బీచ్ లో క్రికెట్ ఆడడాన్ని నిషేధించినట్లు చెబుతూ, ఇంటికి తిరిగి వెళ్లిపోవలసిందిగా సలహా ఇస్తున్నారు. టూరిస్టులను ఆకర్షించేందుకు రూ. 18 కోట్లతో మెరీనా సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టిన చెన్నైకార్పొరేషన్ అధికారులు కూడా బీచ్ పొడుగునా క్రికెట్ ఆడడాన్ని నిషేధించినట్లు తెలియజేస్తూ ఇంగ్లీష్ సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు.
మెరీనా బీచ్ లో క్రికెట్ ఆడుతుండడం వల్ల సుందరీకరణ ప్రాజెక్టుకు అవరోధం కలుగుతుండడం, వాకర్స్ సంఘం నుంచి కూడా ఫిర్యాదులు రావడం వంటి కారణాలతో ఈ నెల 4న ఈ నిషేధాన్ని విధించారు. పోలీస్ శాఖ, ప్రభుత్వ, కార్పొరేషన్ అధికారులు ఈ నెల 4న జరిపిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
క్రికెట్ ఆసక్తిపరులకు ప్రత్యామ్నాయంగా కార్పొరేషన్ వివిధ జోన్లలో 228 క్రీడా మైదానాలను సూచించింది. అయితే, వాటిలో అత్యధిక మైదానాలు క్రికెట్ ఆడేందుకు అనువుగా లేవు. క్రితం వారం క్రికెట్ ఆడుతున్న వారిని పోలీసులు తరిమివేశారు. దీనితో 'క్రికెటర్లు' రాస్తారోకో ఆందోళన నిర్వహించార. పోలీస్, సీనియర్ అధికారులు వారిని శాంతింపజేసి, ప్రత్యామ్నాయ వేదికలుగా కార్పొరేషన్ ప్లేగ్రౌండ్లను సూచించారు
News Posted: 9 November, 2009
|