టెస్ట్ జట్టులోకి శ్రీశాంత్!
న్యూఢిల్లీ : క్రికెట్ పండితుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ పొగరుబోతు స్పీడ్ స్టర్ శ్రీశాంత్ టెస్ట్ జట్టులో స్థానం సంపాయించాడు. మైదానంలో విపరీత చేష్టలతో, మైదానం వెలుపల వింత ప్రవర్తనతో వివాదాల్లో చిక్కుకున్న శ్రీశాంత్ ను శ్రీలంకతో జరిగే టెస్టు సీరీస్ కు ఎంపిక చేసినట్లు బిసిసిఐ మంగళవారం ప్రకటించింది. మూడు టెస్టుల సీరీస్ లో మొదటి రెండు టెస్టులు అడే టీమిండియాలోని 15 మంది సభ్యుల పేర్లను బిసిసిఐ కార్యదర్శి ఎన్ శ్రీనివాసన్ ప్రకటించారు. అందరూ అనుకుంటున్నట్లుగానే జహీర్ ఖాన్ మళ్ళీ జట్టులోకి వచ్చాడు. కానీ శ్రీశాంత్ ఎంపికే విస్మయానికి గురిచేసింది. సంవత్సరం క్రితం చివరి టెస్టు ఆడిన శ్రీశాంత్ వెన్నుగాయంతో క్రికెట్ కు దూరం అయ్యాడు. ఈ సంవత్సర కాలంలో అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా దూకుడు, దుందుడుకు తనాన్ని ప్రదర్శించే శ్రీశాంత్ ఇంత త్వరగా జాతీయ జట్టులోకి వస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. అతను ఈమధ్య కాలంలో దేశీయ క్రికెట్ లో కూడా పెద్దగా ప్రతిభ చూపిన దాఖలాలూ లేవు. కేవలం నెల రోజుల క్రితమే ప్రవర్తన మార్చుకోమని శ్రీశాంత్ కు బిసిసిఐ పెద్దలు హెచ్చరిక చేసి కేరళ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. 26 యేళ్ళ ఈ యువకుడు 2008 ఏప్రిల్ లో దక్షిణాఫ్రికా పై కాన్పూర్ లో చివరి టెస్ట్ ఆడాడు.
భారత్ లో మూడు టెస్టులు, రెండు టి20 మ్యాచ్ లు, ఐదు వన్డేలు ఆడటానికి శ్రీలంక నవంబర్ నెలలో రానున్నది. నవంబర్ 16 వ తేదీన అహ్మదాబాద్ లో తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. భారత జట్టుకు మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వం వహిస్తాడు. ఈ జట్టులోకి వెటరన్ క్రికెటర్లు ఇండియన్ వాల్ రాహుల్ ద్రావిడ్, హైదరాబాద్ సొగసరి బ్యాట్స్ మన్ వివిఎస్ లక్ష్మణ్ వచ్చారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా వన్డేసీరీస్ లో ఆడుతున్న నెహ్రా, మునాఫ్ పటేల్, సురేష్ రైనా, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, పేసర్ ప్రవీణ్ కుమార్ లకు ఈ టెస్ట్ జట్టులో స్థానం దొరకలేదు. తమిళనాడుకు చెందిన మురళీ విజయ్, బద్రీనాథ్ లు జట్టులో చోటు దక్కించుకున్నారు.
వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్, మరో డిపెండబుల్ బ్యాట్స్ మన్ గౌతం గంభీర్ ఓపెనర్లుగా వస్తారు. సచిన్, రాహుల్, యువరాజ్, లక్ష్మణ్, ధోనీలు మిడిలార్డర్ లో ఉంటారు. పేస్ డిపార్టమెంట్లో జహీర్ కు తోడుగా శ్రీశాంత్, ఇషాంత్ శర్మలు బాసటగా నిలుస్తారు. స్పిన్ మాయాజాలాన్ని హర్భజన్ సింగ్ తో పాటు లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, లెఫ్ట్ ఆర్మర్ ప్రజ్ఞాన్ ఓజాలు ప్రదర్శిస్తారు. మొదటి టెస్ట్ అహ్మదాబాద్ లో 16 నుంచి 20 వరకూ, రెండో టెస్ట్ కాన్పూర్ లో 24-28 తేదీల మధ్య, చివరి టెస్ట్ డిసెంబర్ 2-6 తేదీల మధ్య ముంబయిలోనూ జరుగుతాయి.
భారత టెస్ట్ జట్టు(మొదటి రెండు మ్యాచ్ లకు) : మహేంద్రసింగ్ ధోనీ(కెప్టెన్-కీపర్), వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండుల్కర్, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రా, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, ప్రజ్ఞాన్ ఓజా, శ్రీశాంత్, మురళీ విజయ్, బద్రీనాథ్.
News Posted: 10 November, 2009
|