ఏడో వన్డేకు 'ఫైయాన్' ముప్పు ముంబై : ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ కోస్తాకు సమీపంలో అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. దీని ప్రభావంతో భారత్- ఆస్ట్రేలియా మధ్య జరగవలసిన ఆఖరి ఏడో వన్డే మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. 'ఫైయాన్'గా వ్యవహరిస్తున్న ఈ తుపాను కారణంగా ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తవచ్చని, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ డైరెక్టర్ అజిత్ త్యాగి చెప్పారు. బుధవారం సాయంత్రానికి ఈ తుపాను ముంబైని, మహారాష్ట్ర లోతట్టు ప్రాంతాలను తాకే అవకాశం ఉంది. అయితే, తుపాను వల్ల భారీ స్థాయిలో వర్షం పడే అవకాశాలు ఉన్నప్పటికీ ఇది ముంబైని నేరుగా తాకకపోవచ్చునని వాతావరణ శాఖ సూచించింది. తుపాను 'ఫైయాన్' ప్రభావంతో గంటకు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచవచ్చు. ఈ సంవత్సరం మే నెలలో బెంగాల్ తీరాన్ని తాకిన తుపాన్ 'ఐలా' కన్నాతక్కువ తీవ్రతతో ఈ గాలులు వీచవచ్చు.
కేరళ తీరానికి దూరంగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర దిశగా కొంకణ్ తీరం వైపు ప్రయాణించి మంగళవారం తుపానుగా మారింది. దీని ప్రభావంతో గోవా, గుజరాత్, మధ్య ప్రదేశ్ లలో విస్తృతంగా వర్షాలు పడవచ్చు. ఈ తుపాను ప్రమాద స్థాయి 6 : పల్లపు ప్రాంతాలలోని ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని వాతావరణ శాఖ సలహా ఇచ్చింది. మధ్యాహ్నం ముంబైలో వాతావరణం అల్లకల్లోలంగా ఉండవచ్చునని వాతావరణ శాఖ సూచించింది. రేవులలో కార్యకలాపాలను తగ్గించాలని, భద్రతా చర్యలు తీసుకోవాలని కూడా ఈ శాఖ సూచించింది.
గుజరాత్ లోని సూరత్ ఈ తుపానుకు కేంద్రంగా ఉన్నది. కాని ముంబైవాసులపై తుపాను ప్రభావం చూపుతున్నది. ముంబై నగరంలో నిరాఘాటంగా వర్షం కురుస్తున్నది. బుధవారం తెల్లవారు జామున 5.30 గంటలకు వరకు నగరంలో 39 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తర మహారాష్ట్ర పొడుగునా ఏ సమయంలోనైనా బలమైన గాలులు వీచవచ్చు. కాగా, ఇంత తీవ్రతతో ముంబైలో అకాల వర్షాలు కురవడం ఇదే మొదటిసారి.
News Posted: 11 November, 2009
|