శ్రీశాంత్ ఏల? ఎలా?? న్యూఢిల్లీ : క్రికెట్ సెలక్టర్లు తాము తీసుకున్న నిర్ణయాలపై వివరణలు ఇవ్వడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అనుమతి ఇవ్వకపోవడం నిజంగా శోచనీయం. వ్యూహాత్మకంగా, అర్థవంతంగా వ్యవహరించే సెలక్షన్ కమిటీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కు కూడా శ్రీలంకతో టెస్ట్ పోటీలకు భారత జట్టులోకి మీడియం పేసర్ శాంతకుమారన్ శ్రీశాంత్ ను ఎంపిక చేయడాన్ని సమర్థించడం కష్టంగా తోచింది.
అంకెలు మొత్తం కథను చెప్పలేవు, కాని సూచించగలవు. 2009లో శ్రీశాంత్ తొమ్మిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. ఒక సందర్భంలో మాత్రమే, అదీ ఇంగ్లండ్ లో కౌంటీలలో వార్విక్ షైర్ తరఫున ఆడుతూ అతను యార్క్ షైర్ పై ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసుకున్నాడు. అప్పుడు కూడా అతను ఓవర్ కు ఆరుకు పైగా పరుగులు ఇచ్చుకున్నాడు. మొత్తం అతను 232 ఓవర్లలో 854 పరుగులు ఇచ్చి35.58 సగటుతో 24 వికెట్లు తీసుకున్నాడు.
ఇవేవీ చెప్పుకోదగిన గణాంకాలు కావు. అయినప్పటికీ శ్రీశాంత్ ఎప్పటి మాదిరిగానే తప్పు కారణాలతో వార్తలలోని వ్యక్తిగా కొనసాగాడు. మొదట అతని ప్రవర్తనకు గాను ఇరానీ ట్రోఫీ సమయంలో బిసిసిఐ అతని మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించినప్పుడు అతను పతాక శీర్షికలలోకి ఎక్కాడు. ఆతరువాత కేరళ జట్టుకు సారథి అయినప్పటికీ సన్నాహక శిబిరానికి హాజరు కానందుకు శ్రీశాంత్ కు కేరళ క్రికెట్ సంఘం నోటీసు జారీ చేసింది.
నిరంతర అనుచిత ప్రవర్తనకు రివార్డుగా టెస్ట్ జట్టులో స్థానం కల్పించారనే సంకేతాన్ని ఇది పంపడం లేదా? ఒడిఐ జట్టులో చోటు దొరికినా ఆడేందుకు అవకాశం లభించని సుదీప్ త్యాగి టెస్ట్ పోటీలకు పనికిరాడని జాతీయ సెలక్టర్లు భావించారా? మరి ఇరానీ ట్రోఫీ పోటీలో చక్కగా రాణించిన మునాఫ్ పటేల్ సంగతి ఏమిటి? అతను కాకపోయినా న్యూజిలాండ్ లో భారత జట్టు చివరిసారిగా ఆడిన టెస్టుకు జట్టులో స్థానం పొందిన, కాని కనీసం ఆడకుండానే ఆతరువాత పక్కకు తప్పించిన లక్ష్మీపతి బాలాజీ, ధావల్ కులకర్ణి సంగతి ఏమిటి?
2008లో దక్షిణాఫ్రికాపై చివరి సారిగా టెస్ట్ ఆడినప్పటి నుంచి తిరిగి జట్టులో స్థానం పొందుతానంటూ ఒకటే ఊదరగొడుతున్న శ్రీశాంత్ తన బౌలింగ్ తో ఏదైనా అద్భుతం సాధించి ఉన్నట్లయితే మిగిలిన కారణాలన్నిటినీ పక్కకు పెట్టినా అర్థం ఉంటుంది. కాని అతను అటువంటి అద్భుతమేదీ సాధించలేదు. క్యాలెండర్ సంవత్సరంలో అతను కేవలం రెండుసార్లు ఒక మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసుకోగలిగాడు. తన చివరి రంజీ మ్యాచ్ లో బలహీనంగా కనిపిస్తున్న ఆంధ్ర జట్టుపై అతను ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. శ్రీశాంత్ గతంలో తన బౌలింగ్ తో విధ్వంసం సృష్టించాడనడంలో సందేహం ఏమాత్రం లేదు. కాని అతను తనకే కాకుండా జట్టుకు కూడా నష్టదాయకంగా బౌలింగ్ చేసిన సందర్భం కూడా ఈమధ్య కాలంలోనే జరిగింది.
News Posted: 11 November, 2009
|