ముంబాయి వన్డే రద్దు

ముంబాయి : భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య బుధవారం జరగాల్సిన ఏడవ చివరి వన్డే రద్దయింది. అరేబియా మహా సముద్రంలో సంభవించిన పెను తుపాను ఫయాన్ కారణంగా ముంబాయిలో విడవకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ వన్డేని రద్దు చేసినట్లు నిర్వాహకులు సాయంత్రం ప్రకటించారు. ఫయాన్ తుపాను కారణంగా చివరి వన్డే జరిగే అవకాశాలు కనిపించడంలేదని బుధవారం ఉదయం నుంచే అధికారులు ప్రకటిస్తున్నారు. అయితే, ఆట ప్రారంభమయ్యే సమయానికైనా వర్షం తెరిపి ఇస్తే, మైదానం కొద్దిగా అయినా పొడిగా అయితే, ఏదోలా చివరి వన్డే అయ్యిందనిపించాలని నిర్వాహకులు చూశారు. అయితే, ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండడంతో మ్యాచ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని భావించారు. ఎంతకూ వర్షం తగ్గకపోవడంతో చివరికి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
మంగళవారం రాత్రి నుంచీ ముంబాయి నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీనితో ఇరు జట్ల మధ్య బుధవారం జరగాల్సిన చివరి డే అండ్ నైట్ మ్యాచ్ జరగాల్సిన డి.వై. పాటిల్ స్టేడియం పూర్తిగా నీటితో నిండిపోయి చెరువును తలపించేలా మారింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన భారీ వర్షం భారత జట్టును ప్రాక్టీస్ చేసుకోనివ్వకుండా ఆటంక పరిచింది. అయితే, మంగళవారం ఉదయాన్నే ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ చేసుకున్నది. చివరి వన్డే రద్దవడంతో 4-2 తేడాతో ఆస్ట్రేలియా ఈ సీరీస్ ను కైవసం చేసుకున్నట్లైంది.
News Posted: 11 November, 2009
|