ఐపిఎల్ జేబులో 330 కోట్లు ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్ ల ప్రదర్శనా హక్కులు 330 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. క్రికెట్ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న ఐపిల్ కమీషనర్ లలిత్ మోడి ఈ విషయాన్ని వెల్లడించారు. ఎంటర్ టైన్ మెంట్ అండ్ స్పోర్ట్స్ డైరెక్ట్(ఇఎస్ డి) ఈ హక్కులను శుక్రవారం నాడు స్వంతం చేసుకుంది. రాబోయే పదేళ్ల కాలంలో జరిగే ఐపిఎల్ మ్యాచ్ లను ఇఎస్ డి ఎక్కడైనా స్క్రీన్ లపై ప్రదర్శించే హక్కులను పొందింది. పెట్టుబడుల సలహాలు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ డార్ కేపిటల్ గ్రూప్ ఈ ఇఎస్ డిని ప్రమోట్ చేసింది. 2010 నుంచి 2019 వరకూ ఐపిఎల్ మ్యాచ్ ల ప్రదర్శనా హక్కుల విక్రయం కోసం వేసిన వేలంలో ఇఎస్ డి ఎక్కువ మొత్తం కోట్ చేసింది.
ఐపిఎల్ మ్యాచ్ లంటే పడిచచ్చే అభిమాన ప్రేక్షకులుకు సినిమా థియేటర్లలో, స్టేడియాల్లో, నౌకల్లో, బస్సుల్లో, రైళ్ళల్లో, సైనిక కేంద్రాల్లో, ఆసుపత్రుల్లో, బారుల్లో, హోటళ్ళలో, రెస్టారెంట్లలో, విమానాశ్రయాల్లో, రైల్వే స్టేషన్లలో, షాపింగ్ మాల్స్ లో, కార్యాలయాల్లో, నిర్మాణ ప్రదేశాల్లో, ఆయిల్ రిగ్స్ లో , మండపాల్లో, బ్యూటీ పార్లర్లో, స్పా, సెలూన్ లలో, ఇలాంటి బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించే హక్కు ఇఎస్ డి కి వచ్చింది. ఈ వేలంలో ట్రిపిల్ కామ్ కూడా పోటీ పడింది. కాగా ఈ ఒప్పందం టి20 గవర్నింగ్ మండలి ఆమోదం పొందవలసి ఉందని లలిత్ మోడీ చెప్పారు. దీని ద్వారా పెద్ద తెరలపై ఐపిఎల్ మ్యాచ్ లను వీక్షించే అవకాశం టి20 అభిమానులకు కలుగుతుందని ఆయన అన్నారు.
News Posted: 12 November, 2009
|