భారత్ బ్యాటింగ్ అహ్మదాబాద్ : శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్ట్ మ్యాచ్ ల సీరీస్ లో తొలి టెస్ట్ ను భారత్ టాస్ నెగ్గి తన తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తోంది. భారత్ లో శ్రీలంక జట్టు పర్యటనలో భాగంగా స్థానిక మొతేరాలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సోమవారం తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ మొదలైంది. గౌతం గంభీర్ - వీరేంద్ర సెహ్వాగ్ లతో భారత్ తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. శ్రీలంకపై విజయాలు సాధించడం ద్వారా ఇటీవలే స్వదేశంలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన పరాజయ భారం కొంతైనా తగ్గించుకోవాలని ధోనీసేన బరిలోకి దిగింది.
గత 27 ఏళ్ళ చరిత్రలో భారత్ లో ఆరు సార్లు పర్యటించిన శ్రీలంక ఒక్క టెస్ట్ మ్యాచ్ లో అయినా విజయం సాధించలేకపోయింది. అదే జోరును ఇప్పుడు కూడా కొనసాగించాలని భారత్ వ్యూహాలు పన్నింది. కాగా, చరిత్రను తిరగ రాయాలని శ్రీలంక జట్టు కెప్టెన్ సంగక్కర సర్వ శక్తులను ఒడ్డి పోరాటానికి దిగాడు. భారత పర్యటనలో తొలి టెస్ట్ మ్యాచ్ గెలిచిన కెప్టెన్ గా రికార్డులకు ఎక్కాలని, మొత్తానికి సీరీస్ నే ఎగరేసుకుపోవాలని సంగక్కర సేన ఉవ్విళ్ళూరుతోంది.
రెండు జట్లూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగాయి. భారత జట్టులో శ్రీశాంత్, ప్రజ్ఞాన్ ఓజాలకు చోటు దక్కలేదు. మెండిస్, తుషార, కులశేఖర లేకుండా సంగక్కర టీమ్ పోరాటానికి సిద్ధమైంది.
జట్ల వివరాలివీ :
భారత్ : గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండుల్కర్, వివిఎస్ లక్ష్మణ్, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్ \ కీపర్), హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ.
శ్రీలంక : తిలకరత్నె దిల్షాన్, తరంగ పరణవితన్, కుమార సంగక్కర (కెప్టెన్), మహేల జయవర్దనె, తిలన్ సమరవీర, ఏంజెలో మాథ్యూస్, పి. జయవర్దనె (కీపర్), దమ్మిక ప్రసాద్, రంగన హెరత్, ముత్తయ్య మురళీధరన్, చణక వెలెగెదర.
News Posted: 16 November, 2009
|