సచిన్ రేపిన దుమారం ముంబయి : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. 'ముంబయి నగరం భారతదేశానిది. భారతీయులందరిదీ. నేను ముంబయిని అలానే చూస్తాను. నేను మహారాష్ట్రీయుడిని. అందుకు చాలా గర్విస్తాను. కానీ నేను మొదట భారతీయుడిని.' అంటూ శుక్రవారం సచిన్ చేసిన వ్యాఖ్యలపై శివసేన అధినేత బాల్ థాక్రే విరుచుకుపడ్డారు. శివసేన పత్రిక సామ్నాసోమవారం సంచికలో ఆయన సంపాదకీయం రాస్తూ మరాఠీ మనసులను గాయపర్చవద్దని సచిన్ కు సలహా ఇచ్చారు.
ఇలాంటి మాటల ద్వారా క్రికెట్ మైదానం వదిలి రాజకీయ క్రీడలోకి సచిన్ రావడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. క్రికెట్ మేటికి 'లేని పరుగు' చేసే అవసరం లేదని హితవు పలికారు. ఇలాంటి వ్యాఖ్య సచిన్ చేసిన అనవసర సింగిల్ అని, మరాఠీలు తమ మనసులో సచిన్ ను రనౌట్ చేశారని ఆయన అన్నారు. ముంబయిని సాధించడానికి 105 మరాఠీ వీరులు అమరులయ్యారని, అప్పటికి సచిన్ పుట్టలేదని బాల్ థాక్రే పేర్కోన్నారు. సచిన్ వ్యాఖ్యలు ఆ అమరవీరుల త్యాగాన్ని అవమానించేవిగా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సచిన్ తన ఆటపై దృష్టిని కేంద్రీకరిస్తే మంచిదని సూచించారు.
కాగా బాల్ థాక్రే హితవులపై భారత క్రికెట్ కంట్రోలు బోర్డు(బిసిసిఐ) మండిపడింది. బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ సచిన్ ఎలాంటి అనుచిత వ్యాఖ్యా చేయలేదని చెప్పారు. శివసేన గానీ, ఎంఎన్ఎస్ గానీ మహారాష్ట్రకు ప్రతినిధులు కారని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, ఎన్ సి పి లను తమ ప్రతినిధులుగా ఎన్నుకున్నారని ఆయన గుర్తు చేశారు. శివసేన అధినేత బాల్ థాక్రే వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమైనవని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వారు(థాక్రే) మహ్మదాలి జిన్నాలా మాట్లాడుతున్నారని, దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని రాజీవ్ శుక్లా ఆరోపించారు.
News Posted: 16 November, 2009
|