సచిన్ కు చవాన్ బాసట ముంబయి : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు మద్దతుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ నిలిచారు. 'ముంబయి అందరికదీ' అన్న సచిన్ వ్యాఖ్య మొత్తం దేశాన్ని ఐక్యంగా ఉంచుతుందని, ఆమాట సచిన్ హృదయాంతరాళాల్లోంచి వచ్చిందని చవాన్ అన్నారు. సచిన్ వ్యాఖ్యలపై శివసేన విమర్శలు చేయడం సహేతుకం కాదని ఆయన అన్నారు. సచిన్ మాటలు క్రీడాస్పూర్తికి అద్దం పట్టాయని, సచిన్ మహరాష్ట్ర వాడైనా అతడు దేశం కోసం ఆడుతున్నాడని చవాన్ చెప్పారు. తాను సచిన్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని, ప్రజలు శివసేన రాజకీయ క్రీడకు మద్దతు ఇవ్వబోరని ఆయన తెలిపారు. ఇరవై సంవత్సరాల పాటు క్రికెట్ ఆడి సచిన్ సాధించిన విజయాలను చూసి భారత ప్రజలంతా గర్వపడుతున్నారని, భారత్ గర్వపడేలా చేసిన క్రీడాకారుడు సచిన్ అని చవాన్ అన్నారు. సచిన్ గురించి ఎవరో ఎదో మాట్లాడితే తాను వాటికి ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వబోనని చవాన్ అన్నారు.
కాగా ముంబయి భారతీయులందరిదీ అన్నసచిన్ వ్యాఖ్యలపై బాల్ థాక్రే విమర్శలు చేయలేదని శివసేన ప్రతినిధి సంజయ్ రౌత్ వివరణ ఇచ్చారు. ఆటపై ధ్యాస పెట్టమని పెద్ద మనసుతో సచిన్ కు సలహా ఇచ్చారని ఆయన సోమవారం నాడు వివరించారు..
News Posted: 16 November, 2009
|