సచిన్ పై ప్రశంసల జల్లు న్యూఢిల్లీ : సచిన్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. బ్యాటింగ్ అద్భుతంగా చేసి సెంచరీల మీద సెంచరీలు, పరుగుల మీద పరుగులు చేసి రికార్డులు సృష్టించినందుకు కాదు. 'ముంబయి భారతీయులందరిదీ' అని అన్నందుకు. ఈ వ్యాఖ్యపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సామ్నా పత్రికలో సంపాదకీయం రాసిన శివసేన అధినేత బాల్ థాక్రే పై పేరొందిన నాయకులందరూ రాజకీయాలను పక్కన పెట్టి మరీ మండిపడుతున్నారు. సచిన్ వ్యాఖ్యాపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరాదని వారు ఘంటాపథంగా చెబుతున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఇప్పటికే సచిన్ కు బాసటగా నిలిచారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా చవాన్ తో గళం కలిపారు. కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా సచిన్ ను ప్రశంసలతో ముంచెత్తారు. సచిన్ చక్కని మాట చెప్పాడని వారు పేర్కొన్నారు.
ముంబయి అందరిదీ అన్నసచిన్ పై తన గౌరవం మరింత పెరిగిందని నితీష్ కుమార్ అన్నారు. 'థాక్రేకు అలాంటి వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిపోయిందని, సచిన్ చాలా మంచి వ్యక్తని, అతను చెప్పింది నిజమని' క్రికెట్ ప్రేమికుడు, రైల్వేశాఖ మాజీ కేంద్రమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. సచిన్ శివసేన అధినేత థాక్రేను క్లీన్ బౌల్డ్ చేశాడని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు.
News Posted: 16 November, 2009
|