ఐక్యంగా ఐపిఎల్ ఫ్రాంచైజీలు న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లోని ఎనిమిది ఫ్రాంచైజీలు సంఘటితమై ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. , తమ సమస్యలను చెప్పుకోడానికి, వాటిని పరిష్కరించుకోడానకి ఒక వేదిక ఉంటే మంచిదనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేసుకోనున్నట్లు వారు పేర్కొన్నారు. బ్యాంకాక్ లో ఐపిఎల్ వర్క్ షాప్ లో వారు తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చు. ఫ్రాంచైజీల మధ్య చర్చలను ఒక మార్గంలో పెట్టడానికి, ఫ్రాంచైజీలు, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) మధ్య చర్చల ప్రక్రియను క్రమబద్ధం చేసేందుకు లాంఛనంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం సముచితమని భావించిన అనంతరం ఫ్రాంచైజీలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
'బోర్డుతో ఘర్షణకు దిగడానికి కాకపోయినప్పటికీ మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించిన మాట నిజమే. మేము ఎప్పటికప్పుడు మా సమస్యలను ఈ సంఘం ద్వారా తెలియజేస్తుంటాం. అయితే, సంఘం పని చాలా వరకు ఫ్రాంచైజీల మధ్యే చర్చల సరళికి సంబంధించినదిగా ఉంటుంది' అని ఐపిఎల్ ఫ్రాంచైజీ ఒకరు చెప్పారు.
ఇది ఇలా ఉండగా, తదుపరి ఐపిఎల్ సీజన్ లో పాల్గొనేందుకు తమ క్రీడాకారులకు 'నిరభ్యంతర సర్టిఫికెట్' (ఎన్ఒసి)లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) జారీ చేసింది. కోలకతా నైట్ రైడర్స్ (కెకెఆర్)తో కాంట్రాక్టు కుదుర్చుకోనున్న పాకిస్తాన్ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ మంగళవారం ఈ విషయం ధ్రువీకరించాడు. 'ఐపిఎల్ కోసం ఎన్ఒసిలను పిసిబి మాకు జారీ చేసింది. ఈ దఫా ఇండియాలో లీగ్ లో మేము పాల్గొనగలుగుతామని ఆశిస్తున్నాం' అని రజాక్ చెప్పాడు. మరి ఇండియాలో ఆడేందుకు క్రీడాకారులకు ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిందా అనే ప్రశ్నకు రజాక్ సమాధానం ఇస్తూ, అదేమీ సమస్య కాదని, ప్రభుత్వం తమను ఆడేందుకు అనుమతిస్తుందని చెప్పాడు.
తొలి ఐపిఎల్ లో 11 మంది పాకిస్తానీ క్రీడాకారులు పాల్గొన్నారు. కాని ముంబై దాడుల అనంతరం ఇండియాలో ఆడవద్దని తన క్రీడాకారులకు పాకిస్తాన్ ప్రభుత్వం సలహా ఇచ్చిన తరువాత వారి కాంట్రాక్టులను రద్దు చేశారు. నలుగురు క్రీడాకారులు - కమ్రాన్ అక్మల్, సోహైల్ తన్వీర్, ఉమర్ గుల్, మిస్బా ఉల్ హక్ మాత్రమే ఫ్రాంచైజీలతో తమ కాంట్రాక్టును నిలబెట్టుకోగలిగారు. కాని వారి కాంట్రాక్టులను సస్పెన్షన్ లో ఉంచారు. కాగా ఐపిఎల్ నవంబర్ 20ని గడువుగా నిర్దేశించింది.
News Posted: 18 November, 2009
|