లార్డ్స్ పేరు మారేనట! లండన్ : క్రికెట్ క్రీడకు స్వస్థలమైన లండన్ లార్డ్స్ మైదానం పేరు త్వరలో మారనున్నది. 900 మిలియన్ డాలర్లు వ్యయం కాగల అభివృద్ధి పథకంలో భాగంగా ఈ పేరు మార్చనున్నారు. లార్డ్స్ క్రికెట్ మైదానానికి యజమాని అయిన మెరైల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసిసి) ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ క్రికెట్ వేదికకు పెద్ద ఎత్తున మరమ్మతులు చేయాలని యోచిస్తున్నది. ఈ కార్యక్రమంలో భాగంగానే పేరు మార్పు జరుగుతుంది. అయితే, ఈ నామకరణం హక్కులను ఒక స్పాన్సర్ కు విక్రయించవచ్చు.
'నామకరణం హక్కులు సంపాదించడం ఒక మార్గం. అయితే, ఆత్మను అమ్ముకునే స్థితికి చేరుకున్నారా అనేదే ప్రశ్న' అని ఎంసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ కీత్ బ్రాడ్షా అన్నట్లు 'ది గార్డియన్' పత్రిక తెలియజేసింది. స్పాన్సర్ షిప్ ప్యాకేజీలను ఇండియాకు విక్రయించవచ్చునని ఆయన ఆశిస్తున్నట్లు పత్రిక తెలిపింది. లార్డ్స్ కు పేరును సూచించే హక్కుతో పాటు ఏడు స్టాండ్ లలో ఒక్కొక్కదానికి నామకరణం హక్కుల అమ్మడం కూడా ఈ పథకంలో భాగం కావచ్చు.
ఈ పథకంలో భాగంగా స్టేడియంలో సీట్ల సంఖ్యను ఏడు వేలకు పైగా పెంచనున్నారు. అండర్ గ్రౌండ్ క్రికెట్ అకాడమీని కూడా ఏర్పాటు చేయనున్నారు. కాగా, బీజింగ్ లో 'బర్డ్స్ నెస్ట్' ఒలింపిక్ స్టేడియం సృష్టికర్త అయిన స్విస్ ఆర్కిటెక్ట్ లు హెర్జోగ్ అండ్ డి మ్యూరోన్ సంస్థకు కొత్త సూపర్ స్టేడియంకు రూపకల్పన చేసే బాధ్యత అప్పగించారు.
News Posted: 19 November, 2009
|