కష్టాల్లో టీమిండియా అహ్మదాబాద్ : శ్రీలంకతో ఇక్కడి సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా కష్టాలు ఎదుర్కొంటోంది. మూడు టెస్ట్ మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా అహ్మదాబాద్ లో తొలి మ్యాచ్ నాలుగో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక కంటే 334 పరుగులు వెనుకబడి ఉన్న టీమిండియా గురువారం మధ్యాహ్నం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.
భారత ఓపెనర్ గౌతం గంభీర్ క్రీజ్ వద్ద నిలకడగా ఆడుతూ తన జట్టుకు మంచి పునాది వేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాడు. మొత్తం 120 బంతులు ఎదుర్కొని 7 బౌండరీల సాయంతో భారత్ స్కోరుకు 74 పరుగులు జోడించి నాటౌట్ గా ఉన్నాడు. మరో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దూకుడుగా ఆడుతూ, 67 బంతులు ఎదుర్కొని 7 బౌండరీల సాయంతో 51 పరుగులు చేసి అవుటయ్యాడు. రంగన హెరత్ వేసిన బంతిని ఆడి ఏంజెలో మాథ్యూస్ కు మిడ్ ఆన్ వద్ద క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన రాహుల్ ద్రవిడ్ 66 బంతులు ఎదుర్కొని 6 బౌండరీలతో 38 పరుగులు చేసి వెలెగెదర బౌలింగ్ లో ఎల్ బిడబ్ల్యు అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో రాహుల్ సెంచరీ చేశాడు. టూ డౌన్ గా బరిలో దిగిన అమిత్ మిశ్రా 25 బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 12 పరుగులు చేసి నాటౌట్ బ్యాట్స్ మన్ గా ఉన్నాడు. గంభీర్, మిశ్రా నైట్ వాచ్ మెన్ గా ఉన్నారు. శుక్రవారం ఉదయం మళ్ళీ భారత్ తరఫున వీరిద్దరూ బ్యాటింగ్ కొనసాగిస్తారు. శ్రీలంక బౌలింగ్ లో చణక వెలెగెదర, రంగన హెరత్ చెరో వికెట్ తీసుకున్నారు.
మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక కంటే టీమిండియా 144 పరుగులు వెనుకబడి ఉంది. తొలి మ్యాచ్ కు ఇంక ఒక్కరోజే మిగిలి ఉంది. ఇప్పటికే వెనుకబడి ఉన్న పరుగులను అధిగమించడం, ఆ పైన మరిన్ని పరుగులు చేయడం, రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి శ్రీలంకను సవాల్ చేసి లక్ష్యాన్ని చేరకుండా నిలువరించగలగడం భారత్ ముందున్న సవాళ్లు. అతి తక్కువ సమయమే ఉన్న క్రమంలో వీటిని టీమిండియా సాధించగలదా లేదా అన్నది శుక్రవారం సాయంత్రానికి తేలిపోతుంది.
News Posted: 19 November, 2009
|