ధోనీ,భజ్జీ కొత్త పార్ట్నర్ షిప్
ముంబయి : పరువు నిలబెడుతుందనుకున్న ముంబయి వన్డే వర్షార్పణం అయిపోతే పోయింది. కానీ ధోనీ, బజ్జీల ముంబయి పర్యటన మాత్రం కృష్ణార్పణం కాలేదు. చక్కగా ఇద్దరూ కలిసి వ్యాపారం చేసుకున్నారు. ఆస్ట్రేలియాతో ఏడు వన్డేల సీరీస్ లో భాగంగా చివరి వన్డేను ముంబయి డివై పాటిల్ స్టేడియంలో ఆడాల్సి ఉంది. కానీ ఫయాన్ తుపాను దాన్ని తుడిచిపెట్టేసింది. పోతే పోయింది. మన స్టార్లకు ఫలితం దక్కింది. ఈ మ్యాచ్ పేరుతో రెండు రోజులు ముందే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, స్పిన్నర్ హర్భజన్ సింగ్ ముంబయి వచ్చేశారు. ఇద్దరూ భాగస్వాములై లోవర్ పారెల్ ప్రాంతంలో భవంతిలోని ఒక అంతస్థును కొనేశారు. దీని కోసం ఇద్దరూ కలిసి పాత కస్టమ్స్ హౌజ్ వద్ద ఉన్న ఆస్థుల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూర్చుని కొనుగోలు తతంగాన్ని పూర్తి చేసుకున్నారు.
ముంబయిలోని సేనాపతి బాపట్ మార్గలో ఉన్న ట్రేడ్ వరల్డ్ బిల్డింగ్ ఎనిమిదో అంతస్తును కొనుగోలు చేశారని, 14 వేల 160 చదరపు అడుగుల ఫ్లోర్ ను దాదాపు 23 కోట్ల రూపాయలకు వీరు స్వంతం చేసుకున్నారని రిజిస్ట్రేషన్ అధికారులు వివరించారు. ఈ భవంతిలో అనేక కార్పొరేట్ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఈ క్రికెట్ కోటీశ్వరులు ఏ వ్యాపారం ప్రారంభిస్తారో తెలీదు కానీ వీరు కొన్న అంతస్థుకు పది వాహనాలను పార్కు చేసుకునే సౌకర్యం ఉందని తెలిసింది. 'ఇది నికార్సుగా జరిగిన లావాదేవీ' అని ముంబయి ఆస్థుల కన్సల్టెన్సీ జోన్స్ లాంగ్ లాసల్లా మేఘ్ రాజ్ సంస్థ చైర్మన్ అనూజ్ పూరి చెప్పారు. వారికి ఇది చాలా చవగ్గా వచ్చిందని, చదరపు అడుగు 14 వేల రూపాయలకు కొనుక్కున్నారని, ప్రస్తుతం ఈ ప్రాంతంలో 16 వేల రూపాయల ధర ఉందని ఆయన వివరించారు. నవంబరు 9 వ తేదీన ధోనీ, భజ్జీ వచ్చి అవసరమైన అన్ని పత్రాలపైన సంతకాలు చేశారని, స్టాంప్ డ్యూటీగా కోటి రూపాయలు చెల్లించారని ఆయన వెల్లడించారు. వీరిద్దరు ముంబయిలో ఆస్థి కొనడం ఇదే తొలిసారి. బాంద్రా నివాసి నీతా రవీంద్ర నుంచి ఈ అంతస్థును వీరు కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని భజ్జీ ధృవీకరించాడు.
రిజిస్ట్రేషన్ చేసిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్ జిజె భాంబాలే మాట్లాడుతూ ఇద్దరు క్రికెటర్లు చాలా మర్యాదస్తులని కితాబు ఇచ్చారు. చాలా ఓపికగా రిజిస్ట్రేషన్ కు అవసరమైన పత్రాలను వారు నింపారని, రద్దీగా ఉన్న సమయంలో వారు తతంగం పూర్తయ్యే వరకూ వేచి ఉన్నారని ఆయన తెలిపారు. తమను చూడటానికి వచ్చిన వారిని చిరునవ్వుతో పలకరించారని, కొంత మంది అభిమానలతో కరచాలనాలు కూడా చేశారని ఆయన వివరించారు. ధోనీ, భజ్జీ మైదానంలోనే కాదు నిజ జీవితంలో కూడా మంచి దోస్తులే. గత యేడాదిగా భజ్జీ మైదానంలో పెద్దగా రాణించకపోయినా ధోనీ అతనికి అండగానే ఉన్నాడు. ఇదిగో ఈ కొనుగోలుతో వారి అనుబంధం ఎంత బలంగా ఉందో అందరికీ తెలిసింది.
News Posted: 20 November, 2009
|