లంక-భారత్ తొలి టెస్ట్ డ్రా అహ్మదాబాద్ : భారత్ - శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఎలాంటి ఫలితమూ తేలకుండా డ్రాగా ముగిసింది. టెస్ట్ మ్యాచ్ ఫలితం తమకు దక్కే అవకాశాలు లేనప్పటికీ చేజారిపోకుండా గౌతం గంభీర్ (114), సచిన్ టెండుల్కర్ (100 నాటౌట్) సెంచరీలు సాధించి కాపాడగలిగారు. భారత జట్టు రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయకపోవడం, భారత బ్యాట్స్ మెన్ ను శ్రీలంక ఆలౌట్ చేసి రెండో ఇన్నింగ్స్ ఆడే సమయం లేకపోవడంతో ఇరు జట్లూ డ్రా చేసేందుకు అంగీకరించాయి. దీనితో తొలి టెస్ట్ డ్రా అయినట్లు శుక్రవారం సాయంత్రం అంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్ లో అత్యధికంగా 275 పరుగులు చేసిన శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనె మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు.
మ్యాచ్ ఐదో రోజు శుక్రవారం నాడు భారత ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గౌతం గంభీర్ (114 పరుగులు - 13 బౌండరీలతో) సెంచరీ చేయడం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ (100 పరుగులు- 11 బౌండరీలతో) టెస్ట్ లలో 43వ సెంచరీ చేయడం విశేషం.
భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్ల నష్టానికి 190 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం బ్యాటింగ్ ప్రారంభించింది. 24 పరుగులు చేసిన అమిత్ మిశ్రా ఏంజెలో మాథ్యూస్ బౌలింగ్ లో తిలకరత్నె దిల్షాన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం బరిలోకి అడుగుపెట్టిన సచిన్ టెండుల్కర్ ఓపెనర్ గంభీర్ తో జతకలిశాడు. ఇద్దరూ చక్కని సమన్వయంతో రాణించి స్కోరును పెంచారు. గంభీర్ 114 పరుగులు చేసిన తరువాత హెరాత్ బంతికి దొరికిపోయి దమ్మక ప్రసాద్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గంభీర్ స్థానంలో క్రీజ్ వద్దకు వచ్చిన వివిఎస్ లక్ష్మణ్ సచిన్ తో కలిసి సమన్వయంతో, నిలకడగా ఆడాడు. లక్ష్మణ్ అర్ధ సెంచరీ (51) చేసి నాటౌట్ గా నిలిచాడు. టెస్ట్ మ్యాచ్ లలో 30 వేల పరుగుల ప్రపంచ రికార్డు చేసిన సచిన్ తన 34వ టెస్ట్ సెంచరీ పూర్తి చేసిన తరువాత ఇరు జట్లూ మ్యాచ్ డ్రా చేసేందుకు అంగీకరించాయి.
ఆట డ్రా అయ్యే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టపోయి 412 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 426 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్ల నష్టానికి 760 పరుగులు చేసి 334 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. శ్రీలంక బౌలింగ్ లో రంగణ హెరాత్ 2 వికెట్లు పడగొట్టాడు. చణక వెలెగెదర, ఏంజెలో మాథ్యూస్ చెరో వికెట్ తీసుకున్నారు. మొత్తం మీద అహ్మదాబాద్ టెస్ట్ ఎలాంటి ఫలితమూ లేకుండా డ్రాగా ముగిసింది.
News Posted: 20 November, 2009
|