వీరూ, గంభీర్ సెంచరీలు కాన్పూర్ : ఇక్కడి గ్రీన్ పార్క్ మైదానంలో క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్లు పరుగుల పండుగ చేస్తున్నారు. శ్రీలంకతో మంగళవారం ఉదయం ఇక్కడ ప్రారంభమైన రెండో టెస్ట్ మ్యాచ్ తమ తొలి ఇన్నింగ్స్ లో వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ సెంచరీలు చేశారు. డాషింగ్, డేరింగ్ ఓపెనింగ్ బ్యాట్స్ మన్ వీరేంద్ర సెహ్వాగ్ 'మెరుపు సెంచరీ' చేసి, అందరి కళ్ళను జిగేల్ మనిపించాడు. తొలుత నిదానంగా ఆడిన వీరు అనంతరం తన బ్యాట్ ను ఝళిపించాడు. ఆట 33.5వ ఓవర్ వద్ద 97వ బంతికి 101 పరుగులతో సెంచరీ అత్యంత వేగంగా పూర్తిచేశాడు. టెస్ట్ మ్యాచ్ లలో వీరూకి ఇది 16వ సెంచరీ. వీరూ సెంచరీలో రెండు సిక్సర్లు, 15 బౌండరీలు ఉన్నాయి. ఆట 41.2వ ఓవర్ లో తన వ్యక్తిగత స్కోర్ 131 పరుగులకు ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ లో తిలకరత్నె దిల్షాన్ కు క్యాచ్ ఇచ్చిన వీరూ పెవిలియన్ చేరుకున్నాడు. అప్పటికి భారత్ స్కోర్ 233 ఉంది.
గౌతం గంభీర్ కూడా తన ఖాతాలో అర్ధ శతకం పూర్తయ్యే వరకూ కాస్త నిదానంగా ఆడాడు. అనంతరం రెచ్చిపోయి బంతిని మైదానం నలుదిక్కులకు కొట్టి శ్రీలంక ఫీల్డర్లను ముప్పు తిప్పలు పెడుతున్నారు. వీరేంద్ర సెహ్వాగ్ వెనుకనే గంభీర్ కూడా తన స్కోర్ ను పరిగెత్తించాడు. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్న గంభీర్ ఆట 42.1వ ఓవర్ వద్ద రంగణ హెరత్ బంతిని బౌండ్రీకి తరలించడం (103 పరుగులు) ద్వారా సెంచరీ పూర్తిచేశాడు. దీనితో టీమిండియాకు ఓపెనర్లిందరూ చక్కని ప్రారంభాన్ని అందించినట్లైంది.
News Posted: 24 November, 2009
|