టీమిండియా రికార్డులు

కాన్పూర్ : ఇక్కడి గ్రీన్ పార్క్ మైదానంలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్, తొలి రోజు ఆటలో భారత్ రెండు రికార్డులు సాధించింది. వరుసగా నాలుగు టెస్ట్ మ్యాచ్ లలో సెంచరీలు చేయడం ద్వారా భారత బ్యాట్స్ మన్ గౌతం గంభీర్ రికార్డులకు ఎక్కాడు. అంతకు ముందు సునీల్ గవాస్కర్ ఇలా వరుసగా నాలుగు టెస్ట్ మ్యాచ్ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు గంభీర్ గవాస్కర్ పక్కన స్థానం సంపాదించాడు. మరో పక్కన ఇదే మైదానంలో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో 400 పరుగులు దాటిన జట్టుగా కూడా టీమిండియా కొత్త రికార్డును సొంతం చేసుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు నష్టపోయి 417 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ గౌతం గంభీర్ (167), వీరేంద్ర సెహ్వాగ్ (131) సెంచరీలు చేశారు. ఒన్ డౌన్ లో బరిలోకి వచ్చిన రాహుల్ ద్రావిడ్ (85) కూడా సెంచరీ దిశగా సాగుతున్నాడు. దూకుడుగా ఆడుతున్న సమయంలో శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ వేసిన బంతిని తిలకరత్నె దిల్షాన్ కు క్యాచ్ ఇచ్చి వీరేంద్ర సెహ్వాగ్ పెవిలియన్ చేరుకున్నాడు. సెహ్వాగ్ స్కోర్ లో 2 సిక్సర్లు, 18 బౌండరీలున్నాయి. అప్పటికి భారత్ స్కోర్ 233 ఉంది. అనంతరం క్రీజ్ వద్దకు వచ్చిన రాహుల్ ద్రావిడ్ తో కలిసి గంభీర్ కూడా పరుగుల వరద పారించాడు. ఆట 75.1వ ఓవర్ వద్ద మళ్ళీ మురళీధరన్ బంతిని అతని చేతికే క్యాచ్ ఇచ్చి గంభీర్ తన వ్యక్తిగత స్కోర్ 167 ఉండగా వెనుదిరిగాడు. గంభీర్ 15 బౌండరీల సాయంతో ఈ స్కోర్ చేశాడు. అప్పటికి ఇండియా స్కోర్ 370 పరుగులు.
గంభీర్ అవుటవడంతో టూ డౌన్ లో బరిలోకి వచ్చిన సచిన్ టెండుల్కర్ రాహుల్ ద్రావిడ్ కు జత కలిశాడు. ఇద్దరూ సమన్వయంతో ఆడుతూ వికెట్లను కాపాడుకుంటూ భారత జట్టును భారీ స్కోరు దిశగా నడిపిస్తున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ద్రావిడ్ 85, టెండుల్కర్ 20 పరుగులతో క్రీజ్ వద్ద నైట్ వాచ్ మెన్ గా నిలిచారు. రెండు భారత్ వికెట్లనూ ముత్తయ్య మురళీధరన్ తీసుకున్నాడు.
News Posted: 24 November, 2009
|