బిసిసిఐకి స్పాన్సర్ల ఝలక్ న్యూఢిల్లీ : ఇది నమ్మడానికి చాలా కష్టం కావచ్చు. కాని పచ్చి నిజం. టీమిండియా సభ్యులు మ్యాచ్ లో ధరించే చొక్కాలపై లోగోకు స్పాన్సర్లు లేరు. ఎవరూ ముందుకు రాలేదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్రికెట్ తారలతో కిటకిటలాడుతున్నటీమిండియా, ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రీడా మండలిగా వినుతికెక్కిన బిసిసిఐ దిమ్మెరపోయే వాస్తవం ఇది. ఎగరేసుకుపోతారను కున్న చొక్కా లోగో వైపు ప్రముఖ వాణిజ్య సంస్థలు ఒక్క చూపు కూడా చూడలేదు. దీని వేలానికి బిడ్ లను ఆహ్వానిస్తూ నవంబర్ 2 న బిసిసిఐ ప్రకటన ఇచ్చింది. నవంబరు 24 ఆఖరు గడువు తేదీ. ఒక్క బిడ్ పడితే ఒట్టు.
ఆసక్తి ఉన్నవారు నవంబర్ 22 న 50 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని బిసిసిఐ పేర్కొందు. ఎవరూ ఉలకాలేదు పలకాలేదు. కనీసం రూపాయి కూడా కట్టలేదు. దాంతో మార్కెటింగ్ కమిటీని అత్యవసరంగా సమావేశపరిచింది. అయినా ఫలితం దక్కలేదు. టీమిండియా ఐసిసి ర్యాంకింగ్ టాప్ అంటూ డమాబుస్ కబుర్లు మినహా సీరిసీలను, టోర్నీలను గెలవడంలో చతికిలపడుతున్న జట్టు పట్లు నిరాసక్తత ఒక కారణమైతే, కళ్ళు తిరిగిపోయే ఫీజులు కూడా స్పాన్సర్లు వెనుకంజ వేయడానకి కారణమని చెబుతున్నారు. టెస్ట్, వన్డే, టి20 ఏదైనా స్పాన్సరర్ మ్యాచ్ కు మూడు కోట్లు చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. రాబోయే నాలుగేళ్ళ కాలంలో అన్నీ కలిపి టీమిండియా చేత 170 మ్యాచ్ లు ఆడించడం ద్వారా 510 కోట్ల ఆదాయాన్ని జెర్సీ లోగో వేలం ద్వారా రాబట్టాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది కాస్తా బెడిసి కొట్టి మొదటికే మోసం వచ్చింది. గత నాలుగేళ్ళలో సహరా ఇండియా స్పాన్సరర్ గా ఉండి దాదాపు 400 కోట్ల రూపాయలను బిసిసిఐకి చెల్లించింది.
ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితే అయినప్పటికీ త్వరలోనే స్పాన్సరర్ ను సంపాదించగలమని బిసిసిఐ అధికారి ఒకరు ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ కొత్తగా టెండర్లు పిలవాలని బోర్డు భావిస్తోంది. మ్యాచ్ ఫీజులకు కాస్తంత తగ్గించాలని ఆలోచిస్తోంది. సహారా ఇండియా తో ఒప్పందం డిసెంబర్ 31తో ముగిసిపోతోంది. ఈలోగా స్పాన్సరర్ దొరకకపోతే సహారా జెర్సీలతోనే టీమిండియా ఆడాల్సి ఉంటుంది.
News Posted: 24 November, 2009
|