ద్రావిడ్ రికార్డు కాన్పూర్ : భారత క్రికెట్ జట్టులో మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ తన ఖాతాలో మరో రికార్డును జమ చేసుకున్నాడు.టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో ద్రావిడ్ నాలుగో స్థానంలో నిలిచాడు. కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ మైదానంలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో తమ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు బుధవారం ఉదయం రాహుల్ 11,175 పరుగులు పూర్తిచేయడం ద్వారా ఈ మైలురాయిని దాటాడు. ఇంత వరకూ ఈ స్థానంలో ఉన్న అలెన్ బోర్డర్ 11,174 పరుగులను రాహుల్ ద్రావిడ్ అధిగమించాడు.
మంగళవారం సాయంత్రం 85 పరుగుల వ్యక్తిగత ఓవర్ నైట్ స్కోరుతో బుధవారం రాహుల్ బరిలో దిగి మరో 15 పరుగులు జోడించి సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 226 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 144 పరుగులు చేశాడు. ద్రావిడ్ స్కోరులో ఒక సిక్సర్, 15 బౌండరీలున్నాయి. ఆట 113.2వ ఓవర్ లో రాహుల్ ను హెరాత్ రన్నౌట్ చేశాడు.
మ్యాచ్ రెండో రోజు మధ్యాహ్న భోజన విరామానికి భారత్ నాలుగు వికెట్లు నష్టపోయి 535 పరుగులతో ఆడుతోంది. టూ డౌన్ లో బ్యాటింగ్ బరిలో దిగిన సచిన్ టెండుల్కర్ 91 బంతులు ఎదుర్కొని 40 పరుగులకే అవుటయ్యాయి. అజంతా మెండిస్ వేసిన బంతిని సమరవీరకు క్యాచ్ ఇచ్చి సచిన్ వెనుదిరిగాడు. వివిఎస్ లక్ష్మణ్ 24 పరుగులతోను, యువరాజ్ సింగ్ 13 పరుగులతోనూ క్రీజ్ వద్ద ఉన్నారు.
News Posted: 25 November, 2009
|