ఫాలో ఆన్ ఆడుతున్న లంక కాన్పూర్ : టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో శ్రీలంక జట్టు గురువారంనాడు ఫాలో ఆన్ ఆడుతోంది. భారత్ పై తొలి ఇన్నింగ్స్ లో 413 పరుగులు వెనుకబడి ఉన్న శ్రీలంక తరంగ పరణవితన్, తిలకరత్నె దిల్షాన్ లతో తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.
అంతకు ముందు శ్రీలంక జట్టు ఆట మూడవ రోజు గురువారం నాడు తన తొలి ఇన్నింగ్స్ లో 229 పగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ శ్రీశాంత్ రూపంలో శ్రీలంక జట్టు విధ్వంసం జరిగిపోయింది. మొత్తం 22 ఓవర్లు బౌలింగ్ చేసిన శ్రీశాంత్ 75 పరుగులిచ్చి ఐదు లంక వికెట్లను పీకిపారేశాడు. గురువారం ఉదయం బౌలింగ్ ప్రారంభించిన కొద్ది సేపటికే శ్రీశాంత్ మూడు లంక టాప్ ఆర్డర్ వికెట్లను పెవిలియన్ దారి పట్టించడం ద్వారా కోలుకోలేని దెబ్బ తీశాడు. తరువాత మరో రెండు వికెట్లకు శ్రీశాంత్ మంగళం పాడేశాడు. మరో పక్కన హర్భజన్ సింగ్ రెండు వికెట్లు, ప్రజ్ఞాన్ ఓజా మరో రెండు వికెట్లు పడగొట్టారు. భారత ఓపెనింగ్ బౌలర్ జహీర్ ఖాన్ తొలి బంతికే శ్రీలంక ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్ ను డకౌట్ చేసి వెనక్కి పంపించాడు.
టీమిండియాతో జరిగిన తొలి టెస్ట్ లో సెంచరీల మీద సెంచరీలు చేసిన లంకేయులు రెండో కాన్పూర్ టెస్ట్ లో కనీసం అర్ధ సెంచరీ కూడా చేయలేక భారత బౌలర్ల ముందు కాళ్ళు, కళ్ళు తేలేశారు. దీనితో వారు ఫాలో ఆన్ లో పడ్డారు. శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్ వ్యక్తిగత స్కోర్లు ఇలా ఉన్నాయి. తిలకరత్నె దిల్షాన్ 0, తరంగ పరణవితన్ 38, కెప్టెన్ కుమార సంగక్కర 44, మహేల జయవర్దనె 47, థిలన్ సమరవీర 2, ఏంజెలో మాథ్యూస్ 13, వికెట్ కీపర్ పి.జయవర్దనె 39, రంగణ హెరాత్ 11, ముత్తయ్య మురళీధరన్ 6, చణక వెలెగెదర 7 పరుగులు చేయగా అజంతా మెండిస్ 6 పరుగులతో నాటౌట్ బ్యాట్స్ మన్ గా నిలిచాడు. మొత్తం మీద 229 పరుగులకు శ్రీలంక ఆలౌట్ అయి, ఫాలో ఆన్ ఆడుతోంది. కాగా, ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక జట్టుకు శ్రీశాంత్ పెద్ద యముడిలా తయారయ్యాడు. శ్రీలంక జట్టు 13 పరుగుల వద్ద ఉండగా ఓపెనింగ్ బ్యాట్స్ మన్ తిలకరత్నె దిల్షాన్ ను అవుట్ చేసి పెవిలియన్ కు పంపించాడు. అప్పటికి ఆట 3.3 ఓవర్ జరుగుతోంది. దిల్షానం వ్యక్తిగత స్కోర్ 11 పరుగులు మాత్రమే. భారత్ బౌలర్ల హవా ఇలాగే కొనసాగితే రెండో టెస్ట్ ఫలితం త్వరగానే తేలిపోవచ్చు.
News Posted: 26 November, 2009
|