ఓటమి బాటలో లంక కాన్పూర్ : లంకేయులు ఓటమి బాటలో పయనిస్తున్నారు. భారత బౌలర్ల ధాటికి తమ తొలి ఇన్నింగ్స్ లో అతి తక్కువ స్కోరుకే చేతులెత్తేసి ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక టాప్ ఆర్డర్ మరోసారి దారుణంగా విఫలమైంది. అతి తక్కువ స్కోరుకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లోమునిగిపోయింది. భారత క్రికెట్ జట్టుతో ఇక్కడి గ్రీన్ పార్క్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 57 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్ల జోరు ఇదే జోరు కొనసాగిస్తే నాలుగో రోజు శుక్రవారం తొలి సెషన్ లోనే విజయం టీమిండియా ఖాతాలో జమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
తొలి ఇన్నింగ్స్ లో 413 పరుగులు వెనుకబడి ఉన్న శ్రీలంక గురువారం మధ్యాహ్నం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ తిలకరత్నె దిల్షాన్ వికెట్ ను శ్రీశాంత్ పడగొట్టడం ద్వారా శ్రీలంక పతనానికి బాట వేశాడు. టీమిండియా కీపర్ కమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒడుపుగా క్యాచ్ పట్టడంతో తొలి వికెట్ జారిపోయింది. అప్పటికి లంక స్కోరు కేవలం 13 పరుగులు ఉండగా దిల్షాన్ వ్యక్తిగత స్కోరు 11 పరుగులు చేశాడు. అనంతరం వీరేంద్ర సెహ్వాగ్ మరో ఓపెనింగ్ బ్యాట్స్ మన్ తరంగ పరణవితన్ 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్ బిడబ్ల్యు చేశాడు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన లంక కెప్టెన్ సంగక్కరను హర్భజన్ క్లీన్ బౌల్డ్ చేసి వెనక్కి పంపించాడు. సంగక్కర 42 బంతులు ఎదుర్కొని 11 పరుగులు చేశాడు. అప్పటికి లంక స్కోర్ 54 పరుగులు మాత్రమే. తరువాత బరిలోకి వచ్చిన మహేల జయవర్దనే (10)ను యువరాజ్ సింగ్ / ధోనీలు రన్నౌట్ చేసి పెవిలియన్ కు పంపించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి థిలన్ సమరవీర ఒక్క పరుగుతోను, ఏంజెలో మాథ్యూస్ రెండు పరుగులతోనూ ఆడుతూ నైట్ వాచ్ మెన్ గా ఉన్నారు. భారత్ బౌలింగ్ లో శ్రీశాంత్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ తలో వికెట్ పడగొట్టారు.
News Posted: 26 November, 2009
|