శ్రీశాంత్ ఓ అగ్నిజ్వాల
కాన్పూర్ : చేతుల్లో అగ్నులు చిమ్మే బంతులు, చూపుల్లో జ్వాలా తోరణాలు, శ్వాసలో ప్రచండ భానుని సెగలు... చిచ్చరపిడుగు, విచ్చలవిడి శ్రీశాంత్ విశ్వరూపం ఇది. అంతర్జాతీయ క్రికెట్ లోకి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు పేసర్ శ్రీశాంత్. శ్రీలంక క్రికెట్ జట్టును రెండో టెస్టులో నిస్సహాయులగా మార్చి భారత్ ను విజయం వాకిట నిలబెట్టిన ఘనత ముమ్మాటికీ శ్రీశాంత్ దేనని చెప్పక తప్పదు. వివాదాలతో, గాయాలతో దాదాపు సంవత్సరన్నర కాలం అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న శ్రీశాంత్ ను ఎంపిక చేయడం పట్ల క్రికెట్ పండితులు విస్మయాన్ని వ్యక్తం చేశారు. సెలక్టర్లు వత్తిళ్లకు లొంగిపోయారని ఆరోపించారు. కానీ రెండో టెస్టులో చెలరేగిపోయిన శ్రీశాంత్ శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 75 పరుగులకే ఐదు కీలక వికెట్లు తీసి విమర్శకులకు తగిన సమాధానం చెప్పాడు. రెండో ఇన్నింగ్స్ లో కూడా తొలి వికెట్ తీసి శ్రీలంక పతనానికి మొదటి శాసనం రాసి తన రాక ఎంత అవసరమో తిరుగులేని విధంగా నిరూపించుకున్నాడు.
శ్రీశాంత్ ధాటికి లంకేయుల బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కూలిపోయింది. భారత్ ఉంచిన 642 పరుగుల లక్ష్యానికి మొదటి ఇన్నింగ్స్ లో 413 దూరంలోనే కూలబడిపోయారు. రెండో ఇన్నింగ్ ప్రారంభించిన ద్వీపవాసులు 57 పరుగులకే 4 టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ను పోగొట్టుకుని నిస్సహయాంగా పరాజయాన్ని ఆహ్వానించే దుస్థితిలో ఉన్నారు. ఇంకా 356 పరుగులు చేస్తేనే గాని ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవడం శ్రలంక కు సాధ్యం కాదు. పద్దెనిమిది నెలల క్రితం దక్షిణాఫ్రికా జట్టుతో ఇదే మైదానంలో ఆఖరు మ్యాచ్ ఆడిన శ్రీశాంత్ గురువారం నాడు తలవంచుకునే మైదానంలోకి ప్రవేశించాడు. జహీర్ ఖాన్ తో బాల్ ను పంచుకున్న ఈ అసహన వీరుడు అక్కడి నుంచి రెచ్చిపోయాడు. రోజు ముగిసే సరికి ఆరు వికెట్లను తీసి తలెత్తుకుని గర్వంగా మైదానం వదిలాడు.
News Posted: 26 November, 2009
|