భారత్ ఇన్నింగ్స్ విజయం

కాన్పూర్ : కాన్పూర్ టెస్ట్ ఫలితం ముందుగా ఊహించిన విధంగానే వచ్చింది. శ్రీలంకపై భారత్ ఇన్నింగ్స్ 144 పరుగుల భారీ తేడాతో అపూర్వ విజయం సాధించింది. ఇక్కడి గ్రీన్ పార్క్ మైదానంలో శ్రీలంక బ్యాట్స్ మెన్ ను భారత బౌలర్లు చీల్చి చెండాడారు. తొలి ఇన్నింగ్స్ తరువాత భారత్ కంటే 413 పరుగులు వెనుకబడిన శ్రీలంక ఫాలో ఆన్ ఆడింది. తొలి ఇన్నింగ్స్ లో దారుణంగా విఫలమైన లంకేయులు రెండో ఇన్నింగ్స్ లో కూడా మరోసారి విఫలమయ్యారు. అయితే, నాటౌట్ బ్యాట్స్ మన్ గా నిలిచిన థిలన్ సమరవీర 78 ఒక్కడే భారత బౌలర్లను కాస్త ధాటిగా ఎదుర్కోగలిగాడు. మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ కనీసం అర్ధ శతకానికి చేరువ కూడా కాలేక కళ్ళు తేలేశారు. తొలి ఇన్నింగ్స్ లో 229 పరుగులకే ఆలౌట్ అయిన సంగక్కర సేన రెండో ఇన్నింగ్స్ లో 269 పరుగుల వద్దే కుప్పకూలిపోయింది. దీనితో భారత్ ఇన్నింగ్స్ 144 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. భారత్ - శ్రీలంక జట్ల మధ్య జరిగే మూడు టెస్ట్ మ్యాచ్ ల సీరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. మూడో టెస్ట్ మ్యాచ్ ఫలితం తొలి టెస్ట్ లా తేలకపోయినా సీరీస్ టీమిండియాకే దక్కుతుంది. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తీయడమే కాకుండా మ్యాచ్ ను భారత్ కు అనుకూలంగా మార్చివేసిన శ్రీశాంత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. టెస్ట్ లలో భారత్ కు ఇది నూరవ విజయం.
57 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో నాలుగవ రోజు బ్యాటింగ్ ను శ్రీలంక శుక్రవారం ఉదయం ప్రారంభించింది. అయితే, 269 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలింగ్ లో హర్భజన్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రజ్ఞాన్ ఓజా రెండు వికెట్లు తీసుకున్నాడు. శ్రీశాంత్, జహీర్ ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ లకు తలో వికెట్ లభించాయి.
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో తరంగ పరణవితన్ 20, తిలకరత్నె దిల్షాన్ 11, కుమార సంగక్కర 11, మహేల జయవర్దనె 10, థిలన్ సమరవీర 78 నాటౌట్, ఏంజెలో మాథ్యూస్ 15, పి. జయవర్దనె 29, రంగణ హెరాత్ 13, ముత్తయ్య మురళీధరన్ 29, అజంతా మెండిస్ 31, చణక వెలెగెదర 4 పరుగులు చేశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 642 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రీలంక జట్టు 229 పరుగులే చేయగలిగింది. ఫాలో ఆన్ లో కూడా కేవలం 269 పరుగులకే శ్రీలంక చేతులెత్తేయడంతో భారత్ ఘన విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది.
News Posted: 27 November, 2009
|