సెహ్వాగ్ డబుల్ సెంచరీ ముంబాయి : టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మన్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. వన్డే క్రికెట్ తరహాలో టెస్ట్ మ్యాచ్ లోనూ రెచ్చిపోయాడు. లంకేయులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. కేవలం 168 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తిచేసి క్రికెట్ అభిమాను నుంచి శెభాష్ సెహ్వాగ్ అనిపించుకున్నాడు. ముంబాయిలోని బ్రబౌర్న్ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న చివరి, మూడో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు గురువారం సెహ్వాగ్ చెలరేగి బ్యాటింగ్ చేస్తున్నాడు. సెహ్వాగ్ డబుల్ సెంచరీలో 27 బౌండరీలు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఆట 57వ ఓవర్ లో నాలుగు బౌండరీలు, రెండు రన్స్ చేసి డబుల్ సెంచరీ పూర్తిచేశాడు.
ముందు సెహ్వాగ్ 100 బంతుల్లో 101 పరుగులతో సెంచరీ పూర్తి చేశాడు. ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ లో వీరూ ఈ సెంచరీ చేశాడు. ఇది సెహ్వాగ్ టెస్ట్ కెరీర్ లో 17వ సెంచరీగా నమోదైంది. దీనితో పాటు టెస్ట్ ల్లో వ్యక్తిగత స్కోర్ ఆరు వేల పరుగుల రికార్డు ను సెహ్వాగ్ తన పేరున లిఖించుకున్నాడు. ఆరువేల పరుగుల చేసిన 9వ భారత బ్యాట్స్ మన్ గా వీరూ నమోదయ్యాడు.
అంతకు ముందు శ్రీలంకను 393 పరుగులకు అలౌట్ చేసిన భారత్ మురళీ విజయ్, వీరేంద్ర సెహ్వాగ్ లతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. భారత ఓపెనర్లిద్దరూ శ్రీలంక ఫీల్డింగ్ తో చెడుగుడు ఆడుకున్నారు. లంచ్ విరామానికి 92 పరుగులు చేసిన అనంతరం మూడో సెషన్ లో వీరూ, విజయ్ రెచ్చిపోయారు. అయితే, 39.1వ ఓవర్ వద్ద రంగణ హెరాత్ బంతికి మురళీ విజయ్ ఎల్ బిడబ్ల్యు అయ్యాడు. అప్పటికీ భారత్ స్కోర్ 221 కాగా, విజయ్ వ్యక్తిగత స్కోర్ 87 పరుగులు ఉంది. విజయ్ స్కోర్ లో ఒక సిక్సర్, 10 బౌండరీలున్నాయి. ఒన్ డౌన్ లో రాహుల్ ద్రావిడ్ క్రీజ్ వద్దకు వచ్చి వీరూకు జతకలిశాడు. ఇద్దరూ శ్రీలంక బ్యాటింగ్ ను కకావికలు చేస్తున్నారు.
News Posted: 3 December, 2009
|